మెస్ చార్జీలు పెంచాలని బీసీ విద్యార్థుల మహా ధర్నా

మెస్ చార్జీలు పెంచాలని బీసీ విద్యార్థుల మహా ధర్నా

హైదరాబాద్: బీసీ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ దగ్గర బీసీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఆర్ కృష్ణయ్య ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్కాలర్ షిప్స్ పెండింగ్ బిల్లులు పేరుకుపోతున్నా చెల్లించడం లేదని.. ఐదేళ్ల నుంచి మెస్ చార్జీలు పెంచలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచకపోవడంతో  నాసిరకం ఆహారం పెడుతున్నారని, అందుకే గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు ఆస్పత్రిపాలు అవుతున్నారని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. 

ఓటున్నోళ్లందరికీ పెంచారు.. ఓటు లేదని పిల్లలకు పెంచరా..?

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచారు.. పెన్షన్లు పెంచారు.. అలాగే ఓటున్న వాళ్లందరికీ పెంచారు.. పిల్లలకు ఓటు లేదని పెంచరా..? అని ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మెస్ చార్జీలను 1500 నుంచి 3వేలకు, అలాగే స్కూళ్లలో 3 నుంచి 7వ తరగతి వరకు ఇస్తున్న మెస్ చార్జీలు 950 నుంచి 2వేలకు పెంచాలని.. అలాగే 8 నుంచి 10వ తరగతి వరకు ఇస్తున్న రూ.1100 ను 2వేలకు ఒకే స్లాబ్ గా పెంచాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 

అలాగే కాలేజీ హాస్టళ్లలో.. పాఠశాల హాస్టళ్లలో కాస్మెటిక్ చార్జీలు 15 ఏళ్ల క్రితం నిర్ణయించిన ప్రకారం అమ్మాయిలకు 65 రూపాయలు, అబ్బాయిలకు 50 రూపాయలు ఇస్తున్నారని చెప్పారు. ఇవి ఏమూలకు సరిపోతాయని ప్రశ్నించారు. కాస్మెటిక్ చార్జీలు కనీసం 400 రూపాయలైనా ఇవ్వాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రోజూ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులను ఘెరావ్ చేస్తామని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.