
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకన్న గౌడ్
బషీర్ బాగ్, వెలుగు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గండిచెర్వు వెంకన్న గౌడ్ అన్నారు. హరీశ్ రావు తక్షణమే మంత్రి కోమటిరెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. కాచిగూడ లోని బీసీ సంఘం ఆఫీసులో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మలిదశ రాష్ట్ర సాధన ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసి, రాష్ట్రం వచ్చేదాకా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మంత్రి వెంకటరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తుచేశారు. అలాంటి నేతను పట్టుకుని హాఫ్ నాలెడ్జ్ అనడం సిగ్గు చేటు అని హరీశ్ రావుపై మండిపడ్డారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేరేటి మల్లేశ్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఈర్ల లింగస్వామి యాదవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్ పాల్గొన్నారు.