మంత్రి ఆఫీసు ముందు బీసీ సంఘాల ధర్నా

మంత్రి ఆఫీసు ముందు బీసీ సంఘాల ధర్నా
  • ఏపీలో స్కాలర్ షిప్ 20వేలు.. ఇక్కడ రూ.5500 మాత్రమే


హైదరాబాద్: బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయం దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్ షిప్పులు పెంచాలని.. ఉన్నత విద్య కొనసాగించేందుకు వీలుగా ఫీజు రీయింబర్స్ మెంట్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేద విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. అప్పుల్లో ఉన్న పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కాలేజీల్లో డే స్కాలర్ విద్యార్థులకు 20 వేలు, పాఠశాల స్థాయిలో విద్యార్థులకు 15వేల రూపాయల చొప్పున స్కాలర్ షిప్పులు ఇస్తుంటే.. మన దగ్గర స్కాలర్ షిప్పులు 5వేల 500 రూపాయలే ఇస్తున్నారని అన్నారు.

అప్పుల్లో ఉన్న ఏపీ ఇస్తున్నట్లుగా విద్యార్థుల స్కాలర్ షిప్ 5500 రూపాయల నుంచి 20వేలకు పెంచాలని, అలాగే ఉన్నత చదువులు చదువుకునే వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం బీసీ రిజర్వేషన్ల అంశంపై.... బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ ను కలిసి బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరారు.