బీసీ ఉద్యమం ఆగదు.. త్వరలోనే మిలియన్ మార్చ్

బీసీ ఉద్యమం ఆగదు.. త్వరలోనే మిలియన్ మార్చ్
  • 10 లక్షల మందితో హైదరాబాద్​ను దిగ్బంధిస్తం
  • బీసీ బంద్​ చరిత్ర సృష్టించింది: ఆర్​కృష్ణయ్య
  • బీసీ లీడర్లపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి

ముషీరాబాద్, వెలుగు: రాజ్యాంగ బద్ధమైన వాటా కోసమే తమ పోరాటమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తే అగ్రవర్ణాల కోర్టుకు వెళ్లడం సబబేనా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లకు అడ్డు తలగడం సరైనది కాదన్నారు.

శనివారం బీసీ జేఏసీ తలపెట్టిన బీసీల బంద్ విజయవంతం కావడంతో ఆదివారం విద్యానగర్ బీసీ భవన్ లో వివిధ బీసీ సంఘాలతో కలిసి కృష్ణయ్య మాట్లాడారు. బీసీల బంద్ కు గ్రామస్థాయి నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించిందని, స్వచ్ఛందంగా ప్రజలు బంద్ లో పాల్గొన్నారన్నారు. ఈ బంద్ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోయిందన్నారు. బీసీల పోరాటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని ఆశిస్తున్నామని, ప్రధాని మోదీ స్పందిస్తారని అనుకుంటున్నానన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు పై  మరింత పదును పెట్టి కృషి చేయాలని కోరారు. అన్ని వ్యవస్థలు బీసీల పట్ల వ్యతిరేకంగా ఉన్నాయని తమ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. బీసీ ఉద్యమం ఆగదని త్వరలోనే మిలియన్ మార్చ్ పెట్టి, హైదరాబాద్​ను 10 లక్షల మందితో దిగ్బంధం చేస్తామన్నారు. అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లు ఇస్తాయని తెలిపారు. అన్ని పార్టీలు బీసీ బందులో పాల్గొనడం హర్షనీయమన్నారు.

బీసీ బంద్ చేపట్టి వ్యాపార సముదాయాలు మూసి వేయకపోవడంతో ఆవేదనతో దాడులు చేశారే తప్ప నష్టం చేయాలనే ఉద్దేశం బీసీ నాయకులకు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ లీడర్లపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రాజేందర్, అల్లంపల్లి రామకోటి, రవికుమార్ యాదవ్, బాలయ్య తదితరు నాయకులు పాల్గొన్నారు.