
- ఇక సహించేది లేదు.. వాటా ఇవ్వాల్సిందే
- వివిధ సంఘాల సమావేశంలో ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: దేశచరిత్రలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇక సహించేది లేదని, తమ వాటా తమకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
విద్యానగర్ బీసీ భవన్లో శుక్రవారం జరిగిన బీసీ విద్యార్థి, ఉద్యోగ, వివిధ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు 76 ఏళ్లుగా అన్యాయం చేస్తూనే ఉన్నారన్నారు.
బీసీల జనాభాకు అనుగుణంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పాటు రాజకీయంగా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై చర్చ జరుగుతుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.
లేనిపక్షంలో దేశంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్, కన్వీనర్ గుజ్జ కృష్ణ, వెంకటేశ్, అనంతయ్య, గొరిగి మల్లేశ్ యాదవ్, నందగోపాల్, రాజ్ కుమార్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.