ఫీజు బకాయిలు విడుదల చేయాలె

ఫీజు బకాయిలు విడుదల చేయాలె

మెహిదీపట్నం, వెలుగు : మూడేండ్లుగా రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వారం రోజుల్లో విడుదల చేయాలని, లేకపోతే వేల మంది స్టూడెంట్లతో ప్రగతి భవన్​ను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం స్టూడెంట్లతో కలిసి మాసబ్ ట్యాంక్​లోని తెలుగు సంక్షేమ భవన్ ను ఆయన ముట్టడించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్​మెంట్​బకాయిలు రూ.3,200 కోట్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు పేద స్టూడెంట్లను ఫీజులు చెల్లించాలని తీవ్రంగా వేధిస్తున్నాయని, ఫీజు చెల్లించని వారిని కాలేజీల్లో ఎండలో నిల్చోబెట్టడం, హాల్ టికెట్లు నిరాకరించడం, పరీక్షలు రాయనీయకపోవడం వంటివి చేస్తున్నాయని ఆయన తెలిపారు. పరీక్షలు రాయనిచ్చినా సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని మండిపడ్డారు. దీంతో వేల మంది మధ్యలోనే చదువు మానేస్తున్నారని, కొంతమంది ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.   బీసీ  స్టూడెంట్లకు పదివేల నిబంధన ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్లకు చేస్తున్నట్లే ఫీజు రీయింబర్స్​మెంట్  అమలు చేయాలని ఆయన కోరారు.