- 50 శాతం సీలింగ్ ఎత్తివేసే వరకు దేశవ్యాప్త పోరాటం
- తెలంగాణ, ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసే వరకు దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తూనే ఉంటామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేసర శంకర్రావు స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ ఒకటే ఏకైక పరిష్కార మార్గమన్నారు. రాజ్యాంగ సవరణ కోసం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చొరవ చూపాలన్నారు.
బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఏపీతో పాటు దేశంలోని 11 రాష్ట్రాలలో తమ జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారని నేతలు గుర్తుచేశారు.
అయినా, గతంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దరిమిలా.. బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాల చేతుల్లో లేకుండా పోయిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎస్సీ ఎస్టీలకు, చివరికి అగ్రకులాలకు కూడా జనాభా దామషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తున్నారన్నారు. బీసీలకు మాత్రమే జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు కల్పించకుండా అత్యల్ప శాతం కల్పిస్తూ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని నేతలు ఆరోపించారు.
