IPL 2023: ఐపీఎల్‌లో ఆడనందుకు ఆటగాళ్లకు నజరానా

IPL 2023: ఐపీఎల్‌లో ఆడనందుకు ఆటగాళ్లకు నజరానా

'ఐపీఎల్‌లో ఆడితే కదా డబ్బులు ఇచ్చేది.. ఆడకపోయినా డబ్బులిస్తారా!' అనుకోకండి. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో ఆడినా డబ్బులే.. ఆడకపోయినా డబ్బులే. అలా ఎవరిచ్చారు అంటారా! బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. జాతీయ జట్టు కోసం.. ఐపీఎల్ వద్దనుకున్న బంగ్లా క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ నజరానా ప్రకటించింది.   

జాతీయ జట్టుకు ఆడేందుకు కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ కోవకు చెందిందే ఈ ఘటన.   ఐపీఎల్ 2023 జరిగిన సమయంలోనే బంగ్లాదేశ్ జట్టు.. ఐర్లాండ్‌తో టెస్ట్  సిరీస్ ఆడింది. దీంతో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు షకీబ్‌ అల్‌హసన్‌, లిటన్‌ దాస్‌, తస్కిన్‌ అహ్మద్‌లు.. ఐపీఎల్‌లో ఆడటానికి  నిరాకరించారు. దీంతో వారి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ బంగ్లా క్రికెట్ బోర్డు.. వీరి ముగ్గురికీ కలిపి 65 వేల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 53 లక్షలు)రివార్డుగా ప్రకటించింది. 

ఐపీఎల్ 2023 మినీ వేలంలో బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌. రూ.1.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఐర్లాండ్‌తో టెస్టు సిరీస్‌ కారణంగా షకీబ్‌.. ఐపీఎల్‌-2023 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. మరోవైపు.. ఐర్లాండ్‌ సిరీస్‌ కారణంగా లిటన్‌ దాస్‌ కూడా ఫస్ట్‌హాఫ్‌లో పలు మ్యాచులకు దూరమయ్యాడు. ఆ తర్వాత వచ్చినప్పటికీ..  కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడి మళ్లీ స్వదేశానికి వెళ్లిపోయాడు. అలాగే, గాయపడ్డ ఆటగాడిని రీప్లేస్ చేసేందుకు లక్నో జట్టు.. తస్కిన్‌ అహ్మద్‌ను సంప్రదించగా అతడు తిరష్కరించినట్లు సమాచారం.

"ఐపీఎల్ కంటే జాతీయ జట్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్న ఈ ముగ్గురు ఆటగాళ్లను మేం గౌరవిస్తున్నాం. వారిని మేం బలవంత పెట్టలేదు. ఎలాంటి ఆటంకాలు కలిగించలేదు. వారంతకు వారుగా వారు దేశం కోసం ఆడాలని అనుకున్నారు. అందుకే వారికీ రివార్డ్ ప్రకటిస్తున్నాం.. " అని బీసీబీ ఆపరేషన్స్ చీఫ్ జలాల్ యూనస్ మీడియాకు వెల్లడించారు.