
పాకిస్థాన్ పై గెలిస్తే ఆ కిక్కే వేరు. ఇక దాయాధి దేశంపై ఫైనల్ మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే ఆ విజయం మాటల్లో చెప్పలేనిది. అదే థ్రిల్లింగ్ లో పాక్ పై నెగ్గితే అంతకంటే ఆ మజానే వేరు. ఆసియా 2025 ఫైనల్లో ఈ సీన్స్ చోటు చేసుకున్నాయి. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ లో పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్లో టీమిండియా ఉత్కంఠ మ్యాచ్ లో నెగ్గింది. స్వల్ప ఛేజింగ్ లో చివరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గెలిచి పాకిస్థాన్ పొగరు అనిచింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ పై ఆడిన మూడు మ్యాచ్ ల్లో టీమిండియా విజయం సాధించడం విశేషం.
పాకిస్థాన్ పై విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియాకు బీసీసీఐ ఆ ఆనందాన్ని రెట్టింపు చేసింది. భారీ ప్రైజ్ మనీ ప్రకటించి భారత జట్టుకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆసియా కప్ గెలిచినందుకు బీసీసీఐ రూ.21 కోట్ల భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది. "మూడు దెబ్బలు.. జీరో రెస్పాన్స్.. ఆసియా కప్ ఛాంపియన్స్. జట్టు, సహాయక సిబ్బందికి 21 కోట్ల ప్రైజ్ మనీ". అని బీసీసీఐ తమ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. ఆసియా కప్ లో విజేతకు నిలిచిన భారత జట్టుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి రూ. 2.6 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. అయితే బీసీసీఐ మాత్రం ఏకంగా రూ. 21 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించి బోర్డు గొప్పతనాన్ని చాటుకుంది. బీసీసీఐ ఇచ్చిన ప్రైజ్ మనీ ఆసియా కప్ ప్రైజ్ మనీ కంటే 8 రెట్లు ఎక్కువ కావడం విశేషం.
గత ఏడాది రోహిత్ కెప్టెన్సీలో భారత్ జ ట్టు అద్భుతమైన విజయం సాధించినందుకు..టీమిండియా జట్టుకు బీసీసీఐ రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ఐసీసీ ప్రైజ్ మనీ రూ. 20 కోట్ల రూపాయలు కాగా.. బీసీసీఐ 10 రెట్లు ప్రైజ్ మనీని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ.58 కోట్ల రూపాయల భారీ నగదును ప్రకటించింది. తాజాగా ఆసియా కప్ గెలుచుకున్న టీమిండియాకు రూ. 21 కోట్ల ప్రైజ్ మనీ అందించి ఔరా అనిపించింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ( 53 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 నాటౌట్) అపద్బాంధవుడై ఆదుకున్న వేళ ఆదివారం జరిగిన హై ఓల్టేజ్ ఫైనల్లో ఇండియా 5 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 19.1 ఓవర్లలో 146 రన్స్‌కు ఆలౌటైంది. ఓపెనర్లు సాహిబ్జదా ఫర్హాన్ (44 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57), ఫఖర్ జమాన్ (35 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 46) రాణించగా.. చివరి ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.
కుల్దీప్ యాదవ్ (4/30), మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (2/30), పొదుపుగా బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ (2/26) ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను పేకమేడలా కూల్చారు. బుమ్రా (2/25) కూడా రెండు వికెట్లతో మెరిశాడు. అనంతరం తిలక్ అద్భుత పోరాటంతో ఇండియా 19.4 ఓవర్లలో 150/5 స్కోరు చేసి గెలిచింది. శివం దూబే (22 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33), సంజూ శాంసన్ (24) కూడా రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీన్ అష్రాఫ్ మూడు వికెట్లు పడగొట్టాడు. షహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు.
3 blows.
— BCCI (@BCCI) September 28, 2025
0 response.
Asia Cup Champions.
Message delivered. 🇮🇳
21 crores prize money for the team and support staff. #AsiaCup2025 #INDvPAK #TeamIndia pic.twitter.com/y4LzMv15ZC