మహిళా క్రికెటర్లకు రూ.51 కోట్లు.. భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

మహిళా క్రికెటర్లకు రూ.51 కోట్లు.. భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
  • సపోర్ట్ స్టాఫ్‌‌, నేషనల్ సెలెక్షన్ కమిటీ మెంబర్స్​కు దక్కనున్న ప్రైజ్​మనీ
  • క్రాంతి గౌడ్​కు మధ్యప్రదేశ్‌‌ సీఎం, రేణుకా సింగ్​కు హిమాచల్‌‌ ప్రదేశ్‌‌ సీఎం కోటి చొప్పున ప్రకటన
  • వజ్రాభరణాలు, సోలార్ పానెల్స్​ను గిఫ్ట్‌‌గా ఇవ్వనున్న సూరత్‌‌ వ్యాపారి

న్యూఢిల్లీ/ముంబై: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారిగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌‌  గెలిచి  చరిత్ర సృష్టించిన ఇండియా అమ్మాయిలపై ప్రశంసలతో పాటు కోట్ల వర్షం కురుస్తోంది. హర్మన్‌‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమ్‌‌కు బీసీసీఐ రికార్డు స్థాయిలో రూ. 51 కోట్ల రూపాయల భారీ నగదు బహుమతి  ప్రకటించింది. ‘వరల్డ్  కప్ గెలిచినందుకు విమెన్స్  క్రికెట్ టీమ్‌‌కు బీసీసీఐ 51 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందిస్తుంది. ఇందులో ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్‌‌, నేషనల్ సెలెక్షన్ కమిటీ మెంబర్స్ అందరూ ఉంటారు’ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. 

అమ్మాయిల జట్టుకు ఇంత భారీ మొత్తాన్ని ప్రకటించడం దేశ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. మెన్స్‌‌ టీమ్‌‌కు  కూడా గతంలో ఇంత పెద్ద మొత్తంలో రివార్డు దక్కలేదు. ఇక, వరల్డ్  కప్ విజేత జట్టులో భాగమైన మధ్యప్రదేశ్‌‌ క్రికెటర్ క్రాంతి గౌడ్‌‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్  రూ. కోటి  ప్రత్యేక నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. హిమచల్‌‌ ప్రదేశ్‌‌కు చెందిన పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌‌‌‌కు ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ రూ. కోటి నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా హామీ ఇచ్చారు.

వజ్రాభరణాలు, సోలార్ ప్యానెల్స్..
సూరత్‌‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త , ఎంపీ గోవింద్ ధోలాకియా మహిళా క్రికెటర్లకు వజ్రాభరణాలతో పాటు , వాళ్ల ఇండ్లకు సోలార్ ప్యానెల్స్ గిఫ్ట్‌‌గా ఇస్తానని ప్రకటించారు.