కోల్కత్తా నైట్రైడర్స్ టీం నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్, పేస్ బౌలర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ను రిలీజ్ చేయాలని KKR యాజమాన్యాన్ని BCCI ఆదేశించింది. బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు పేట్రేగిపోవడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ క్రికెటర్కు ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వడం సమంజసం కాదని భావించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ముస్తఫిజుర్ రెహ్మాన్ను వదిలేసుకున్న క్రమంలో రీప్లేస్మెంట్ కోరేందుకు KKR జట్టుకు అవకాశం ఇస్తామని BCCI స్పష్టం చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో ఐపీఎల్ వేలంలో నిలిచిన ముస్తఫిజుర్ను 9.20 కోట్లకు KKR జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మంచి ఫామ్ లో ఉన్న పేస్ బౌలర్ కావడంతో ముస్తఫిజుర్ కోసం చెన్నై, ఢిల్లీ జట్లు కూడా పోటీ పడగా KKR అత్యధిక ధరకు ఈ బంగ్లా పేసర్ ను దక్కించుకుంది.
బంగ్లాదేశ్లో రెండు వారాల వ్యవధిలో నలుగురు హిందువులపై దాడులు జరిగాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 2025 చివరలో హిందూ కుటుంబాల ఇండ్లు, షాపులు లక్ష్యంగా దాడులు చేసి నిప్పంటించారు. బంగ్లాదేశ్‌లో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో హిందువులపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి హిందువుల ఇండ్లు, వ్యాపార సంస్థలు, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.
కాగా, విద్యార్థి సంఘం నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఈ దాడులను ప్రపంచ దేశాలతో పాటు ఇండియా తీవ్రంగా ఖండిస్తున్నది. మైనారిటీల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దాడులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లోని పలు నగరాల్లో హిందువులు భారీ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.
