- శ్రేయస్ అయ్యర్, షమీ రీఎంట్రీ ఇస్తారా?
న్యూఢిల్లీ: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఇండియా జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ శనివారం వర్చువల్‌గా సమావేశమై 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించే అవకాశం ఉంది. సౌతాఫ్రికాపై సిరీస్ గెలిచిన జట్టులో పెద్దగా మార్పులు ఉండే చాన్స్ లేకపోయినా కొన్ని కీలక స్థానాలపై మాత్రం సెలెక్షన్ కమిటీ కఠిన నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే ఫ్యూచర్‌కు ఈ సిరీస్ కీలకం కానుంది. ఇప్పటికే ఏడాదిన్నరగా టీ20లకు దూరమైన సిరాజ్ వన్డే ఫార్మాట్‌లో జట్టులోకి వచ్చిపోతున్నాడు.
రెండేండ్లలో ఆరు మ్యాచ్‌ల్లోనే చాన్స్ ఇవ్వడంతో అతని వన్డే భవిష్యత్తుపై ఆందోళన కలుగుతోంది. జనవరి 11 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌కు టీమ్ సెలెక్షన్‌లో సిరాజ్‌తో పాటు గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయర్ అయ్యర్, వెటరన్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీపైనా చర్చ జరిగే చాన్సుంది. అలాగే, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫ్యూచర్‌పైనా అందరి దృష్టి ఉంది.
సిరాజ్ ఉంటాడా?
గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిరాజ్‌ను ఎక్కువగా టెస్టులు మాత్రమే ఆడిస్తున్నారు. టీ20 ఫార్మాట్ సెటప్ నుంచి పూర్తిగా పక్కనబెట్టిన అతడిని క్రమంగా వన్డేలకు దూరం చేయడం విమర్శలకు తావిస్తోంది. కండిషన్స్ కారణం గా చెబుతూ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయని సిరాజ్‌ను ఆస్ట్రేలియా టూర్‌లో ఆడించారు. కానీ, ఇటీవల సౌతాఫ్రికా సిరీస్‌లో పక్కన పెట్టడం అతని వన్డే కెరీర్‌ను ఆందోళనలో పడేస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో సిరాజ్ తొలి నాలుగు రౌండ్లు ఆడలేదు. అయితే, హైదరాబాద్ జట్టు తరఫున చివరి రౌండ్లలో బరిలోకి దిగే అవకాశం ఉంది. 2023 వరల్డ్ కప్ వరకు జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా ఉన్న సిరాజ్‌ను ఇటీవల వన్డేల నుంచి తరచూ పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొన్నాళ్ల కిందటి వరకూ వన్డేల్లో నంబర్ వన్ బౌలర్‌గా వెలుగొందిన సిరాజ్‌కు 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ పరిస్థితి వస్తుందని చాలా మంది ఊహించలేదు. ఈ సిరీస్‌కైనా అతనికి పిలుపు వస్తుందో
లేదో చూడాలి.
బుమ్రా, పాండ్యాకు రెస్ట్.. షమీ రీఎంట్రీకి చాన్స్!
రాబోయే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని కీలక బౌలర్ల వర్క్‌లోడ్ తగ్గించే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్‌లో రెస్ట్ ఇవ్వొచ్చు. సౌతాఫ్రికా సిరీస్‌లో ఆడిన యంగ్ పేసర్లు హర్షిత్ రాణా , అర్ష్‌దీప్ సింగ్ ను కొనసాగిస్తారా? వారికి కూడా బ్రేక్ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక వెటరన్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీపై మరోసారి చర్చ జరగనుంది. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న షమీ రంజీల్లో 20 వికెట్లు, తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో 4 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రాకు విశ్రాంతినిచ్చే క్రమంలో షమీని తిరిగి జట్టులోకి తీసుకుంటారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
అయ్యర్‌కు ఫిట్‌నెస్ తిప్పలు..
గత అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. గాయం కారణంగా సుమారు 6 కిలోల బరువు తగ్గి వీక్‌గా మారిన అయ్యర్ శుక్రవారం ఓ మ్యాచ్ సిమ్యులేషన్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ నెల 5న మరో సెషన్‌లో పాల్గొన్న తర్వాత రీఎంట్రీకి అవసరమైన ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభిస్తుంది. ప్రస్తుతానికి ఫిట్‌నెస్‌పై స్పష్టత లేనందున అతను ఈ సిరీస్‌కు దూరం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సెలెక్టర్లు చాన్స్ ఇవ్వాలని భావిస్తే ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయాలన్న షరతుతో ఎంపిక చేయొచ్చు.
ఇక, టీమ్‌లో డ్యాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ ను రెండో వికెట్ కీపర్‌గా కొనసాగిస్తారా లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. తన ప్లేస్‌లో డొమెస్టిక్ క్రికెట్‌లో జార్ఖండ్ తరఫున దుమ్మురేపుతున్న ఇషాన్ కిషన్‌ను తీసుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. ఇషాన్ ఇప్పటికే టీ20 టీమ్ నుంచి పిలుపు అందుకున్నాడు. అయితే, గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2024 జులై నుంచి గతేడాది డిసెంబర్ వరకు రిషబ్ పంత్ కేవలం ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే ఆడటం గమనార్హం. అతనికి సరైన అవకాశాలు ఇవ్వకుండా జట్టు నుంచి తప్పించడం కూడా విమర్శలకు తావిచ్చే ప్రమాదం ఉంది. సర్ఫరాజ్ ఖాన్ , దేవదత్ పడిక్కల్ కూడా జట్టులో చోటు కోసం పోటీ పడున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లకు చాన్స్ కష్టమే అనొచ్చు.
