
ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ అయిన డ్రీమ్11తో బీసీసీఐ (Board of Control for Cricket in India) తెగతెంపులు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లు 2025’కు ఆమోదం తెలపడంతో రియల్ మనీ గేమ్స్ బ్యాన్ అయిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు ఉభయ సభలతో పాటు రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఈ క్రమంలోనే.. బీసీసీఐ, డ్రీమ్11 మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా నిర్ధారించారు. టీమిండియా కొత్త లీడ్ స్పాన్సర్ కోసం చూస్తున్నట్లు ఆయన తెలిపారు. టీమిండియా లీడ్ స్పాన్సర్గా ఎడ్యుటెక్ కంపెనీ బైజూ తప్పుకున్నాక డ్రీమ్11 ఆ స్థానాన్ని భర్తీ చేసింది.
జులై 2023 నుంచి టీమిండియా లీడ్ స్పాన్సర్గా డ్రీమ్11 కొనసాగుతోంది. బీసీసీఐతో చేసుకున్న కాంట్రాక్టు ప్రకారం 2023 నుంచి 2026 వరకూ టీమిండియా లీడ్ స్పాన్సర్గా డ్రీమ్11 కొనసాగాల్సి ఉంది. ఈ మేరకు 358 కోట్లకు బీసీసీఐతో డ్రీమ్11 కాంట్రాక్టు కుదుర్చుకుంది. అయితే.. ఆన్ లైన్ గేమింగ్ యాక్ట్ అమల్లోకి రావడంతో ఒక ఏడాది మిగిలి ఉండగానే డ్రీమ్11కు బీసీసీఐ గుడ్ బై చెప్పాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. డ్రీమ్ 11 మాత్రమే కాదు బీసీసీఐతో మై11 సర్కిల్ డీల్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. 2024 నుంచి 125 కోట్లు వార్షికంగా చెల్లిస్తూ మై11 సర్కిల్.. ఐపీఎల్లో అఫిషియల్ ఫ్యాంటసీ పార్టనర్గా కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా.. డ్రీమ్11 పేరెంట్ కంపెనీ డ్రీమ్ స్పోర్ట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. "డ్రీమ్ మనీ" అనే కొత్త యాప్‌ను టెస్ట్ చేస్తోంది. రియల్ మనీ గేమ్స్‌ను కేంద్రం బ్యాన్ చేయడంతో కొత్త సెక్టార్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని వివరాల ప్రకారం, డ్రీమ్ మనీ యాప్ ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడానికి వీలుంటుంది. వినియోగదారులు రోజుకు రూ.10 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే రూ. వెయ్యి నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు పెట్టొచ్చు. ఈ యాప్‌ను డ్రీమ్ స్పోర్ట్స్ అనుబంధ సంస్థ డ్రీమ్‌సూట్ ద్వారా విడుదల చేశారు. డ్రీమ్‌సూట్ ఫైనాన్స్ అనే కొత్త సేవను త్వరలో ప్రారంభించనుంది.