
- దేవరాజ్ నుంచి కీలక సమాచారం రాబట్టిన సీఐడీ
- ఐపీఎల్ నిర్వహణ, ఫ్రాంచైజర్ల అగ్రిమెంట్లపై ఆరా
- ఫేక్ బిల్లులతో హెచ్‌సీఏ నిధులు కూడా దారి మళ్లించినట్లు గుర్తింపు
- దేవరాజ్ ఇల్లు, హెచ్‌సీఏ ఆఫీసులో సోదాలు
- రేపటితో ముగియనున్న ఏడు రోజుల కస్టడీ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిధుల గోల్‌మాల్ కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నకిలీ బిల్స్‌తో బీసీసీఐ గ్రాంట్లు, హెచ్‌సీఏ నిధులను నిందితులు కొల్లగొట్టినట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలింది. హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్ రామ్‌చందర్ నుంచి సీఐడీ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న దేవరాజ్‌ను గత నెల 25న పుణెలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో ఈ నెల 7 నుంచి 13 వరకు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
కస్టడీలో భాగంగా ఆది, సోమవారం ఆయన ఇల్లు, హెచ్‌సీఏ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. దేవరాజ్ కంప్యూటర్, ల్యాప్‌టాప్ నుంచి కీలక సమాచారం సేకరించారు. ప్రధానంగా హెచ్‌సీఏ అధికారిక మెయిల్ నుంచి ఐపీఎల్ నిర్వహణ కోసం టెండర్లు, కాంట్రాక్టులు సహా ఫ్రాంచైజర్స్‌తో అగ్రిమెంట్ల వివరాలు సేకరించారు. అధ్యక్షుడు జగన్ మోహన్ రావుతో కలిసి బీసీసీఐ గ్రాంట్లను దారి మళ్లించడంలో దేవరాజ్ కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు.
సెలెక్షన్ కమిటీలపై సీఐడీకి ఫిర్యాదు చేసిన పీసీసీ ఉపాధ్యక్షుడు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో మెన్స్ సెలక్షన్ సీనియర్, జూనియర్ సెలెక్షన్ కమిటీ సభ్యుల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఏ ఫహీమ్ ఆరోపించారు. కమిటీల నియామకంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయాలని కోరుతూ సీఐడీ అడిషనల్ డీజీ చారు సిన్హాకు ఆయన సోమవారం ఫిర్యాదు చేశారు. లక్డీకపూల్‌లోని సీఐడీ కార్యాలయంలో చారు సిన్హాను ఆయన కలిశారు.
సెలక్షన్ కమిటీకి సంబంధించిన వివరాలతో ఫిర్యాదు పత్రం ఇచ్చారు. అర్హత లేనివారిని కమిటీ సభ్యులుగా నియమించారని పేర్కొన్నారు. సీనియర్ కమిటీలో సభ్యులుగా ఉండాలంటే కనీసం ఏడు టెస్ట్ మ్యాచుల్లో ఆడి ఉండాలని, లేదా 20, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, లేదా 10 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి ఉండాలని వివరించారు. ఈ అర్హతలతోపాటు కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యే నాటికి ఐదేండ్ల ముందే రిటైర్ అయ్యి ఉండాలని తెలిపారు. రెండు కమిటీల ఎన్నికల్లో అవకతవకలపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఫహీమ్ కోరారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిధుల దుర్వినియోగం
ఐపీఎల్ నిర్వహణ కోసం స్టేడియంలో మౌలిక వసతులకు సంబంధించిన వివరాలతో దేవరాజ్ స్టేట్‌మెంట్లను సీఐడీ అధికారులు రికార్డు చేసినట్లు సమాచారం. అధ్యక్షుడు జగన్ మోహన్ రావు, సీఈఓ కాంటే ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా దేవరాజ్‌ను ప్రశ్నిస్తున్నారు. సెక్రటరీగా తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిధుల దుర్వినియోగం చేసినట్లు దేవరాజ్ వెల్లడించినట్లు తెలిసింది. టెండర్లు, బిల్స్, ఇతర అవసరాల కోసం చేసిన నకిలీ బిల్లులను తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. బీసీసీఐ నుంచి వచ్చిన గ్రాంట్లను నకిలీ బిల్లులతోనే కొల్లగొట్టినట్లు తెలిసింది. ఆరో రోజు కస్టడీలో భాగంగా మంగళవారం మరోసారి ప్రశ్నించనున్నారు.