ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ చిత్రం సత్తా చాటుకుంది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో మురళీకాంత్ రూపొందించిన ఈ చిత్రాన్ని రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. గతేడాది డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్‌ను అందుకుంది. తాజాగా గద్దర్ అవార్డుల్లో సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా , బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా శివాజీకి , బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మార్క్ కె రాబిన్ ఇలా మూడు కేటగిరీల్లో ఈ సినిమా అవార్డుల్ని దక్కించుకుంది.
ఈ సందర్భంగా ఆదివారం మూవీ టీమ్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో శివాజీ మాట్లాడుతూ ‘మా ‘దండోరా’ సినిమాని గుర్తించి అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలుగు వాళ్ల ప్రతిభను, సత్తాను చాటే చిత్రమిది. మున్ముందు చాలా అవార్డులు వస్తాయని ఆశిస్తున్నా’ అని అన్నారు.
ఇలాంటి గుర్తింపు, అవార్డులు వస్తే మరింత మంచి చిత్రాల్ని, సందేశాత్మాక సినిమాల్ని తీయాలనే ప్రోత్సాహం లభిస్తుందని దర్శకుడు మురళీకాంత్ చెప్పాడు. తమ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ నిర్మాత రవీంద్ర బెనర్జీ థ్యాంక్స్ చెప్పారు. నటులు నందు, మనికా రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
