Champions Trophy 2025: పాకిస్థాన్‌కు భారత్ వెళ్ళదు.. ఐసీసీకి తెగేసి చెప్పిన బీసీసీఐ

Champions Trophy 2025: పాకిస్థాన్‌కు భారత్ వెళ్ళదు.. ఐసీసీకి తెగేసి చెప్పిన బీసీసీఐ

ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై ఐసీసీ స్పష్టతనిచ్చింది. పాకిస్తాన్‌‌లోనే ఈ టోర్నీ నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. అయితే, బీసీసీఐ మాత్రం పాక్ ‌లో పర్యటించేది లేదని.. ఈ  టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడం లేదని బీసీసీఐ తన నిర్ణయాన్ని ఐసీసీకి శనివారం (నవంబర్ 9) తెలియజేసినట్లు సమాచారం. ఇప్పటివరకు  ద్వైపాక్షిక సిరీస్‌లకు నో చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు పాక్ గడ్డపై జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ ఆడేందుకు నిరాకరించినట్టు తెలుస్తుంది. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుందో ఆసక్తికరంగా మారింది.  

ఆసియా కప్ బాటలోనే ఛాంపియన్స్‌ ట్రోఫీ
 
2023 ఆసియా కప్ టోర్నీ సమయంలోనూ ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ఇదే గొడవ జరిగింది. పాక్ వేదికగా ఆసియా కప్‌ నిర్వహిస్తే భారత జట్టు పాల్గొనేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో హైబ్రిడ్‌ మోడల్‌లో భారత్‌ మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి. అచ్చం 2025లో ఛాంపియన్స్‌ ట్రోఫీ కూడా అలానే జరుగనున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ ఆడబోయే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌ వేదికగా జరుగుతాయని సమాచారం.

ALSO READ : BGT 2024-25: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. కోహ్లీని ఊరిస్తున్న 13 రికార్డులు ఇవే

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, తీవ్రవాదం, కాశ్మీర్ అంశాల్లో వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వేదికగా జరిగే ఏ క్రికెట్ మ్యాచుల్లోనూ పాల్గొనటం లేదు ఇండియా జట్టు. 2023లో ఆసియా కప్ ను సైతం బహిష్కరించింది టీమిండియా. పాక్ వేదికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు చేయనప్పటికీ.. ప్రతిపాదిత షెడ్యూల్ మాత్రం రిలీజ్ చేశారు.