కొత్త కోచ్‌‌ల వేటలో బీసీసీఐ.. సీవోఈ బౌలింగ్‌‌ కోచ్‌‌ ట్రాయ్‌‌ కూలీ త్వరలో గుడ్‌‌బై

కొత్త కోచ్‌‌ల వేటలో బీసీసీఐ.. సీవోఈ బౌలింగ్‌‌ కోచ్‌‌ ట్రాయ్‌‌ కూలీ త్వరలో గుడ్‌‌బై

బెంగళూరు: నేషనల్‌‌ క్రికెట్‌‌ అకాడమీ (ఎన్‌‌సీఏ) స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్‌‌ ఆఫ్‌‌ ఎక్సలెన్స్‌‌ (సీవోఈ)లో కొత్త కోచ్‌‌లను నియమించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. పాత కోచింగ్‌‌ సిబ్బంది మొత్తం వీడ్కోలు పలుకుతున్న నేపథ్యంలో కోచింగ్‌‌ వ్యవస్థలో భారీ మార్పులు చేయాలని బోర్డు భావిస్తోంది. 2021లో ఎన్‌‌సీఏలో బౌలింగ్‌‌ కోచ్‌‌గా చేరిన ప్రఖ్యాత బౌలింగ్‌‌ కోచ్‌‌ ట్రాయ్‌‌ కూలీ త్వరలోనే పదవి నుంచి తప్పుకోనున్నాడు. మూడేండ్ల కాంట్రాక్ట్‌‌ పూర్తి చేసుకున్న 59 ఏండ్ల ట్రాయ్‌‌ కూలీ ప్రస్తుతం ఎక్స్‌‌టెన్షన్‌‌లో ఉన్నాడు. 

కూలీ ఆధ్వర్యంలో పని చేసిన టీమిండియా మాజీ సీమర్‌‌ వీఆర్‌‌వీ సింగ్‌‌ త్వరలో ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మెడికల్‌‌ టీమ్‌‌ హెడ్‌‌ నితిన్‌‌ పటేల్ బృందం నిష్క్రమణ తర్వాత సీవోఈలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక స్పిన్‌‌ బౌలింగ్‌‌ కోచ్‌‌ సాయిరాజ్‌‌ బహుతులే కూడా రాజీనామా చేసి రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ ఫ్రాంచైజీలో సపోర్ట్‌‌ స్టాఫ్‌‌గా చేరాడు. ఎన్‌‌సీఏలో పని చేసిన బ్యాటింగ్‌‌ కోచ్‌‌ సితాన్షు కొటక్‌‌.. టీమిండియాకు ఫుల్‌‌టైమ్‌‌ కోచ్‌‌గా మారిపోయాడు. సీవోఈ హెడ్‌‌గా పని చేస్తున్న హైదరాబాదీ వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌ పదవీకాలం ఈ ఏడాది చివరికి ముగుస్తుంది. 

అతను ఎక్స్‌‌టెన్షన్‌‌ తీసుకునే చాన్స్‌‌ కనిపించడం లేదు. అయితే 2027 వన్డే వరల్డ్‌‌ కప్‌‌ వరకు కొనసాగాలని లక్ష్మణ్‌‌ను కోరే అవకాశం ఉంది. సీవోఈ రెసిడెంట్‌‌ ఫ్యాకల్టీలో భాగంగా ఇప్పటికే బౌలింగ్‌‌, బ్యాటింగ్‌‌, స్పోర్ట్స్‌‌ సైన్స్‌‌ అండ్‌‌ మెడిసిన్‌‌ విభాగాల్లో అభ్యర్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. బీసీసీఐ లెవల్‌‌ 2, 3 కోచింగ్‌‌ సర్టిఫికెట్‌‌ కలిగిన మాజీ ఫస్ట్‌‌ క్లాస్‌‌ లేదా ఇంటర్నేషన్‌‌ క్రికెటర్లు బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌ కోచ్‌‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు చేసుకునే అభ్యర్తి స్టేట్‌‌ లేదా ఎలైట్‌‌ యూత్‌‌ స్థాయిలో కనీసం ఐదేళ్ల కోచింగ్‌‌ (బ్యాటింగ్‌‌/ బౌలింగ్‌‌) అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ రెండు పోస్టుకు సాఫ్ట్‌‌ వేర్‌‌ సాంకేతిక పరిజ్ఞానం కూడా తప్పనిసరి. స్పోర్ట్స్‌‌ మెడిసిన్‌‌ హెడ్‌‌ పదవికి.. స్పోర్ట్స్‌‌ సైన్స్‌‌ లేదా సంబంధిత విభాగంలో మాస్టర్స్‌‌ డిగ్రీ (డాక్టరేట్‌‌ ప్రాధాన్యత) కలిగి ఉండాలి. మల్టీ డిసిప్లినరీ పెర్ఫామెన్స్‌‌ టీమ్‌‌లను నిర్వహించే లీడర్‌‌షిప్‌‌ రోల్‌‌లో కనీసం ఐదేళ్ల ఎక్స్‌‌పీరియెన్స్‌‌ ఉండాలి. దరఖాస్తులు పంపడానికి ఆగస్టు 20 చివరి తేది.