వైభవ్ పక్కనే ఫోన్ వాడిన రాజస్థాన్ మేనేజర్.. బీసీసీఐ షోకాజ్ నోటీసులు

వైభవ్ పక్కనే ఫోన్ వాడిన రాజస్థాన్ మేనేజర్.. బీసీసీఐ షోకాజ్ నోటీసులు

ఐపీఎల్ 2026లో భాగంగా RCB vs RR మ్యాచ్‌ సందర్భంగా ఒక సంచలన ఘటన చోటు చేసుకుంది. స్టేడింయలో ఆటగాళ్ల మెరుపులు ఒకెత్తయితే, డగౌట్‌లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్, మ్యాచ్ జరుగుతుండగా డగౌట్‌లో కూర్చుని మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, PMOA (Players and Match Officials Area) పరిధిలోకి వచ్చే డగౌట్‌లో ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం పూర్తిగా నిషేధం.

రాజస్థాన్ జట్టు మేనేజర్ రోమి భిందర్ ఫోన్ చూస్తుండటం, పక్కనే యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఆ స్క్రీన్ వైపు ఆసక్తిగా చూడటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిని యాంటీ కరప్షన్ (ACU) నిబంధనల ఉల్లంఘనగా పరిగణించిన బీసీసీఐ, 48 గంటల్లో వివరణ ఇవ్వాలని అతడికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే రోమి భిందర్ ఏదో ఆరోగ్య సమస్య కారణంగానే ఫోన్ దగ్గర ఉంచుకున్నారని, దీని కోసం ముందే అనుమతి కోరారని సమాచారం. కానీ, అనుమతి ఉన్నా లేకపోయినా డగౌట్‌లో ఫోన్ వాడటం నిబంధనలకు విరుద్ధం కావడంతో బీసీసీఐ విచారణను వేగవంతం చేసింది.

బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసినట్లు తేలితే గనుక, భిందర్‌పై అధికారిక హెచ్చరిక, భారీ జరిమానా లేదా కొన్ని మ్యాచ్‌ల పాటు సస్పెన్షన్ విధించే ఛాన్స్ ఉంటుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపిన తర్వాత నివేదిక సమర్పించాలని ఏసీయూను ఆదేశించినట్లు తెలుస్తుంది.