తెలంగాణ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. దుండిగల్ లోని MLRIT మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో మహబూబ్నగర్ జట్టుపై 3 వికెట్ల తేడాతో మెదక్ విజయం సాధించింది. 270 పరుగులు, 11 వికెట్లు తీసిన మెదక్ టీం ప్లేయర్ అఫ్రీదీని ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా ప్రకటించారు. ఈ మ్యాచ్ కు ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, MLRIT చైర్మన్ మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. టోర్నమెంట్ లో చాంపియన్ గా నిలిచిన మెదక్ టీమ్ కు ట్రోఫీ, క్యాష్ ప్రైజ్ ను వినోద్ కుమార్ ప్రదానం చేశారు. ఈసందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత క్రికెట్ ఆటగాళ్ల కోసం ఈ లీగ్ నిర్వహిస్తున్న వివిధ జిల్లాల క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ‘‘ గ్రామీణ ప్రాంతాల్లోని టాలెంట్ ఉన్న ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. అలాంటి ప్లేయర్ల కు కొంచెం చేయూత అందించినా టీమ్ ఇండియాకు ఎంపికవుతారు. ఇటీవల ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ వేలంలో బీసీసీఐకి చాలా డబ్బులు వచ్చాయి. అందులో కొంత బడ్జెట్ ను ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం కేటాయిస్తే బాగుంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
