
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో ఆడే రెండు, మూడు క్రీడలకు మద్దతిచ్చేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. ఆ క్రీడలు ఏవో నిర్ణయించాలని సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 58 కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో గురువారం సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయా సమావేశమయ్యారు. ఇందులో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా పాల్గొన్నారు. ‘మినిస్ట్రీ తీసుకునే నిర్ణయాలను మేం స్వాగతిస్తాం. రెండు, మూడు క్రీడలకు మద్దతిచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అవి ఏంటో నిర్ణయించే అధికారం వాళ్లకే వదిలేస్తున్నాం. మాకు కేటాయించిన క్రీడా విభాగాల్లో అథ్లెట్లకు అత్యుత్తమ శిక్షణను ఇప్పించేందుకు కృషి చేస్తాం’ అని శుక్లా పేర్కొన్నాడు.
వచ్చే ఒలింపిక్ సైకిల్‌ను దృష్టిలో పెట్టుకుని దేశంలో వంద నుంచి రెండొందల మంది అత్యుత్తమ క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలని, ఇందుకు కార్పొరేట్ సంస్థలు మద్దతివ్వాలని మినిస్ట్రీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నిర్వహిస్తున్న 23 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్‌సీవోఈ) ఉన్నాయి. వీటిలో బాక్సింగ్ (రోహ్‌తక్), స్విమ్మింగ్ (ఢిల్లీ), షూటింగ్ (ఢిల్లీ)లకు మాత్రమే సపరేట్‌గా ఎక్సలెన్సీలు ఉన్నాయి. బహుళ క్రీడలకు సంబంధించి అతిపెద్ద ఎన్‌సీవోఈలు పాటియాల, బెంగళూరులో ఉన్నాయి. అయితే ప్రతి క్రీడకు ఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మినిస్ట్రీభావిస్తోంది.