ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లకి బీసీసీఐ వార్నింగ్.. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లకి బీసీసీఐ వార్నింగ్.. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. లీగ్ స్టేజ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ల తీరుపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు జారీ చేసిన నిబంధనలను కొన్ని జట్ల యజమానులు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించింది. ఇకపై రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. మ్యాచ్ జరిగే సమయంలో జట్టు ఓనర్లు ప్లేయింగ్ ఏరియాలోకి రావొద్దని, ఆటగాళ్లు లేదా సపోర్ట్ స్టాఫ్‌తో ప్రత్యక్షంగా మాట్లాడొద్దని తేల్చి చెప్పారు. కానీ కొందరు ఓనర్లు ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదని బీసీసీఐ చెప్పింది. 

ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులకు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాం.. డగౌట్‌ సమీపంలో ఓనర్లు తిరుగుతూ కనిపిస్తున్నారు.. మరికొందరు మొబైల్ ఫోన్లతో స్టేడియంలోకి వచ్చి ఫొటోలు కూడా తీస్తున్నారు.. వాటికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయి.. అనేక సార్లు హెచ్చరించినా వారి తీరులో మార్పు రావడం లేదు.. మరోసారి ఇదే సీన్ రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో ‘హనీ ట్రాప్’ ప్రమాదాలపై కూడా బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలను అలర్ట్ చేసింది. ప్లేయర్స్ లేదా అధికారులపై లైంగిక వేధింపుల లాంటి ఆరోపణలు వచ్చే ఛాన్స్లు ఉన్నాయని వార్నింగ్ ఇచ్చింది. హై ప్రొఫైల్ క్రీడా వాతావరణాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి, ప్రతి ఫ్రాంచైజీ అప్రమత్తంగా ఉండాలని దేవజిత్ సైకియా తెలియజేశారు. బీసీసీఐ, ఐపీఎల్ ఆపరేషన్స్ సభ్యులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి నజర్ పెట్టింది. ఈ బృందాలు హోటల్ గదుల్లో తనిఖీలు చేయడంతో పాటు పర్మిషన్ లేని వ్యక్తులు.. ప్లేయర్స్ గదుల్లోకి ప్రవేశించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది.