ఐపీఎల్లో PBKS తరపున ఎంట్రీ.. 18 ఏళ్ల తర్వాత పంజాబ్ vs రాజస్థాన్ మ్యాచ్కి అంపైర్గా శ్రీవాస్తవ  

ఐపీఎల్లో PBKS తరపున ఎంట్రీ.. 18 ఏళ్ల తర్వాత పంజాబ్ vs రాజస్థాన్ మ్యాచ్కి అంపైర్గా శ్రీవాస్తవ  

లక్నోకు చెందిన మాజీ రంజీ ఆటగాడు తన్మయ్ శ్రీవాస్తవ ఐపీఎల్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా అరంగేట్రం చేయబోతున్నాడు. ఏప్రిల్ 28న ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో అతను ఈ కొత్త బాధ్యతలను చేపట్టాడు. 2008లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆటగాడిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన శ్రీవాస్తవ, 18 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే జట్టు ఆడే మ్యాచ్‌లో సరికొత్త పాత్రలో మైదానంలోకి దిగడం విశేషం.

ఐపీఎల్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా విధులు నిర్వర్తించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొట్ట మొదటి అంపైర్‌గా అతను గుర్తింపు పొందాడు. గత ఏడాది అతను ఐపీఎల్‌లో ఫోర్త్ అంపైర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా అతనికి మొత్తం నాలుగు మ్యాచ్‌ల బాధ్యతలు అప్పగించారు. వీటితో పాటు, పలు మ్యాచ్‌లలో ఫోర్త్ అంపైర్‌గా, టీవీ అంపైర్‌గా కూడా అతను సేవలు అందించనున్నాడు.

* పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ (ఏప్రిల్ 28)
* ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (మే 5)
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (మే 10)
* చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (మే 18)


క్రికెటర్‌గా ప్రయాణం: 
అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన తన్మయ్ శ్రీవాస్తవ.. తన క్రికెట్ ప్రయాణాన్ని లక్నో వీధుల్లో ప్రారంభించాడు. అతను మొదట చౌక్, కేడీ సింగ్ బాబు స్టేడియాల్లో ఆడాడు. ఆ తర్వాత గ్రీన్ పార్క్ హాస్టల్‌కు వెళ్లి, కాన్పూర్ తరఫున అండర్-14 క్రికెట్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ వరకు అంచెలంచెలుగా ఎదిగాడు. టీమిండియా మాజీ అండర్-19 కెప్టెన్ అయిన శ్రీవాస్తవ, తన కెరీర్‌లో 90 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 4,918 పరుగులు సాధించాడు.

ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత శ్రీవాస్తవ ఆర్సీబీ (RCB) జట్టుకు స్కౌట్‌గా కూడా పని చేశాడు. అనంతరం కోచింగ్ వైపు వెళ్లగా, లెవల్ 2 కోచింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. జమ్మూ కాశ్మీర్ రంజీ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలు అందించడంతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో అండర్–-16 జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా కూడా పని చేశాడు. ఆ తర్వాత అంపైరింగ్ వైపు అడుగులు వేసిన అతను, గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లలో అంపైర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.