న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. షెడ్యూల్ ప్రకారమే టీ20 వరల్డ్‌కప్ జరుగుతుందని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది. అయితే మొదట షార్ట్ లిస్ట్ చేసిన 9 నగరాలకు బదులుగా ఐదు వేదికల్లో మాత్రమే మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ఇండియాలో అనివార్య పరిస్థితులు తలెత్తితే.. బ్యాకప్ వెన్యూగా యూఏఈని కూడా సెలెక్ట్ చేసుకుంది. ‘టీ20 వరల్డ్‌కప్‌కు ఇంకా ఐదు నెలల టైమ్ ఉంది. అప్పటి వరకు దేశంలో చాలా మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. కాబట్టి మెగా ఈవెంట్ నిర్వహణకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మ్యాచ్‌లను నాలుగు లేదా ఐదు వేదికలకే పరిమితం చేయాలన్న ఆప్షన్ కూడా ఉంది’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ బయో సెక్యూర్ ఎన్విరాన్‌మెంట్‌ను పరిశీలించేందుకు ఐసీసీ టీమ్ ఒకటి ఈ నెల 26న ఢిల్లీకి రావాల్సి ఉంది. కానీ ట్రావెల్ బ్యాన్ కారణంగా ట్రిప్ పోస్ట్‌పోన్ అయ్యింది. సిచ్యువేషన్ నార్మల్‌కు వచ్చిన తర్వాత ఐసీసీ టీమ్ ఇక్కడ పర్యటిస్తుందని సదరు అధికారి తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.. యూఏఈని ఎప్పట్నించో సెకండ్ అప్షన్‌గా ఉంచుకున్నామని బీసీసీఐ జనరల్ మేనేజర్ ధీరజ్ మల్హోత్రా వెల్లడించాడు. లాస్ట్ ఇయర్ ఐసీసీ మీటింగ్‌లోనే దీనిపై నిర్ణయం తీసుకున్నామన్నాడు.
