మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు పిలుపు
బషీర్బాగ్, వెలుగు: ‘ఓట్లు బీసీలవే.. సీట్లు బీసీలవే.. అధికారం బీసీలదే’ అన్న కాన్షీరాం నినాదంతో బీసీలంతా కలిసికట్టుగా ఉద్యమించి రాజ్యాధికారం సాధించాలని రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ ఆలిండియా కోఆర్డినేటర్ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు.
గురువారం రవీంద్రభారతిలో బీసీ సమాజ్, బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో జరిగిన రజక సర్పంచ్లు, ఉప సర్పంచ్ల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు, ముఖ్యంగా రజకులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
కమ్మ, రెడ్డి కులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. బీసీ రిజర్వేషన్లపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా రజక ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ మనువరాలు చిట్యాల శ్వేత, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
