
ముషీరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీసీలు సిద్ధంగా ఉండాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని బీసీలను సంఘటిత శక్తిగా మార్చేందుకు కోటి బీసీల సభ్యత్వ నమోదు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం బాగ్ లింగంపల్లిలోని ఆఫీసులో సభ్యత్వ నమోదుపై పలు జిల్లాల ముఖ్య నాయకులతో దాసు సురేశ్సమావేశమయ్యారు. సభ్యత నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధానాలను వివరించారు.
జూన్నెలాఖరులోగా పది లక్షల మంది కార్యకర్తల సభ్యత్వ నమోదు పూర్తి చేస్తామన్నారు. గ్రామ, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లాల వారీగా ముందుకు వెళ్తున్నామన్నారు. 15 సంవత్సరాలు పైబడిన ప్రతీ బీసీ బిడ్డకు సభ్యత్వ నమోదు అందుబాటులో ఉంటుందని, ఆన్‌లైన్‌ద్వారా కూడా చేసుకోవచ్చని చెప్పారు. క్రియాశీలక నాయకులకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించనున్నామని, యువ నాయకులకు, మహిళలకు కమిటీల్లో అధిక ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రాజగోపాల్, గండి వీరేందర్ గౌడ్, ఏరుకొండ హైమావతి, ముంజాల రాజేందర్ గౌడ్, వంగ రవి, దేవి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.