HDFC బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది..?

HDFC బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది..?

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో హెచ్‌డీఎఫ్‌సీ రీజినల్ మేనేజర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించింది. లక్నోలోని గోమతీనగర్‌లోని వినయాఖండ్ 4 ప్రాంతంలోని తన నివాసంలో మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు లక్నోలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో రీజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ శర్మ (31)గా గుర్తించారు.

బ్యాంకు మేనేజర్ మృతి చెందినట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బ్యాంక్ మేనేజర్ తీసుకున్న ఈ తీవ్ర చర్య వెనుక ఉన్న ప్రధాన కారణమేంటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ తన ఆత్మహత్యను గుండెపోటుగా భావించాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అందరినీ వదిలి వెళ్ళడం తనకు చాలా కష్టంగా ఉందని చెప్పాడు. అతను తన బంధువులను సంతోషంగా ఉండాలని, అందరికీ తుది వీడ్కోలు అని తెలిపాడు.

సూసైడ్ నోట్ లో ఏముందంటే..

అందరినీ వదిలేయడం చాలా కష్టంగా ఉంది.. ఇకపై ఎవరినీ ఇబ్బంది పెట్టను.. నన్ను క్షమించండి అందరూ సంతోషంగా ఉండండి... అందరికీ వీడ్కోలు పలుకుతున్నాను అంటూ బ్యాంకు మేనేజర్ సూసైడ్ నోట్‌లో రాశాడు. ప్రశాంత్ శర్మకు భార్య, తల్లి, తండ్రి ఉన్నారు. అతను ఏదో విషయంలో మనస్తాపం చెంది ఉంటాడని, అందుకే అతని సూసైడ్ చేసుకుని ఉండవచ్చని వారు చెబుతున్నారు.

ప్రశాంత్ గది పైకప్పుకు ఉరివేసుకున్నాడు

గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న అతని కుటుంబ సభ్యులు.. అతను ఎంతసేపటికీ రెండో అంతస్తులోని గది నుంచి బయటికి రాకపోవడంతో.. కాసేపయ్యాక వారు వెళ్లి అతని తలుపు తట్టారు. ప్రశాంత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కిటికీలోంచి చూసేసరికి ప్రశాంత్ గది పైకప్పుకు వేలాడుతూ కనిపించాడు.