కరీంనగర్ జిల్లా రేకుర్తిలో మరోసారి ఎలుగుబంటి కలకలం సృష్టించింది. జనావాసాల్లో ఎలుగుబంటి తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రేకుర్తిలోని ఓ మార్బుల్ స్టోర్లో గుడ్డేలుగు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎలుగుబంటి సంచారం గురించి తెలియడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. మార్బుల్ స్టోర్కు కొద్ది దూరంలోని బద్దిపల్లి ప్రాంతంలోని గ్రానైట్ క్వారీల వైపు నుంచి ఎలుగుబంటి వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం శాతవాహన యూనివర్సిటీలో పరిసరాల్లో ఓ ఎలుగుబంటి కనిపించింది. అప్పటి నుంచి దాని ఆచూకీ కోసం ఫారెస్ట్ అధికారులు గాలిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం రేకుర్తిలో కనిపించిన ఎలుగు అదే అయి ఉంటుందని భావిస్తున్నారు.
