ఫీటున్నర జాగా (18 ఇంచుల) కోసం కొడుకు వేధింపులు : వృద్ధ దంపతుల ఆత్మహత్య

ఫీటున్నర జాగా (18 ఇంచుల) కోసం కొడుకు వేధింపులు : వృద్ధ దంపతుల ఆత్మహత్య
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఆశిరెడ్డిపల్లిలో విషాదం
  • ఒకే చితిపై దహన సంస్కారాలు

వేములవాడ రూరల్, వెలుగు : ఆస్తి పంపకంలో భాగంగా ఫీటున్నర (18 ఇంచులు) జాగ కోసం తల్లిదండ్రులను పెద్ద కొడుకు, కోడలు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం..రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కనికరపు దేవయ్య (69), లక్ష్మీనర్సవ్వ (60) దంపతులకు కూతురు, ఇద్దరు కొడుకులున్నారు. వీరి పాత ఇంటి వెనకాల పెద్ద కొడుకు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆస్తి పంపకాల్లో భాగంగా పెద్ద కొడుక్కి 18 ఇంచుల జాగ ఇచ్చేది ఉండడంతో పాత ఇల్లు కూల్చి ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించాడు. ఈ విషయమై శనివారం తల్లిదండ్రులతో గొడవ పడి ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి మల్లన్న దేవుడిని తీసుకెళ్తామని, ఇల్లు కూల్చివేయాల్సిందేనని హెచ్చరించాడు. .

దీంతో మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం అలికిడి లేకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు ఇంట్లోకి వెళ్లి చూడగా విగతజీవులై పడి ఉన్నారు. చిన్న కొడుకు మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్​ తెలిపారు. కాగా, వృద్ధ దంపతులను ఒకే చితిపై ఉంచి దహన సంస్కారాలు నిర్వహించారు.  పెద్ద కొడుకును పోలీసులు తీసుకువెళ్లడంతో చిన్న కొడుకును కాదని కూతురితో గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహింపజేశారు.