నీలోఫర్లో బెడ్లు కొరత.. చిన్నారులకు నేలపైనే వైద్యం

నీలోఫర్లో బెడ్లు కొరత.. చిన్నారులకు నేలపైనే వైద్యం

సర్కార్ దవాఖానాలకు వచ్చే రోగుల తిప్పలు తీరడం లేదు. చిన్నారుల నీలోఫర్ హాస్పిటల్ లో బెడ్స్ సరిపోక.. ఒకే బెడ్ పై ఇద్దరిని పడుకోబెడుతున్నారు. NICU నుంచి జనరల్ వార్డ్ వరకూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు పేషంట్లు. ప్రీటర్మ్ లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్న పసికందుల ఇంక్యుబేటర్ బాక్సులు సరిపోకపోవడంతో నేలమీద కూడా పడుకోబెడుతున్నారు. నీలోఫర్ లో బెడ్స్, మెడిసిన్ కొరతతో పాటు హాస్పిటల్ డెవలప్మెంట్ పనులు ముందుకు సాగడం లేదు.

ఒకే బెడ్ పై ముగ్గురు చిన్నారులు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ పిడియాట్రిక్ దవాఖానా నీలోఫర్.. వెయ్యి పడకల సామర్ద్యమున్న ఈ హాస్పిటల్ కు రోజూ వేలాది మంది వస్తుంటారు. ఉన్న బెడ్స్ కు అడ్మిట్ అవుతోన్న పేషంట్స్ కు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ఒకే బెడ్ పై ఇద్దరు, కొన్ని సందర్భాల్లో ముగ్గురు చిన్నారులను పడుకోబెడుతున్నారు. NICU నుంచి జనరల్ వార్డ్ వరకూ ఇదే పరిస్థితి ఉందంటూ చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీలోఫర్ హాస్పిటలే దిక్కు

సీజన్ తో సంబంధం లేకుండా హాస్పిటల్లోని బెడ్స్ అన్నీ ఎప్పుడూ ఫుల్ అవుతాయి. ఈ సీజన్ లో పిడీయాట్రిక్ కేసులు తక్కువగా ఉంటాయి. అయినా కూడా ఇక్కడ బెడ్స్ సరిపోవడం లేదంటే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కో బెడ్ పై ఇద్దరిని పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు. ముఖ్యంగా నీలోఫర్ కు ప్రీ టర్మ్ బేబీ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. జిల్లా ప్రభుత్వ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి రిఫరెన్స్ మీద ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. ప్రైవేట్ లో NICU ట్రీట్మెంట్ కు రోజుకు లక్ష వరకూ ఖర్చవుతుంది. దీంతో పేద, మధ్య తరగతి వారికి.. నీలోఫర్ హాస్పిటలే దిక్కు.

వసతులు మాత్రం సరిగ్గా లేవు

నీలోఫర్ లో వైద్యం అందుతోన్నా.. వసతులు మాత్రం సరిగా లేవంటున్నారు పేషంట్ బంధువులు. ఒకే ఇంక్యుబేటర్ బాక్సులో ఇద్దరు చిన్నారులను పడుకోబెడుతున్నారు. ఇంక్యుబేటర్స్ సరిపోకపోవడంతో.. పసికందులను నేలపైనే ఉంచి ఆక్సిజన్ పెడుతున్నారు. ఒకే బెడ్ పై ఇద్దరు ఉంటే.. ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందని పేరంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక హాస్పిటల్ లో బెడ్స్ కొరతతో పాటు.. మెడిసిన్ కూడా సరిగా ఇవ్వడం లేదని చిన్నారుల పేరంట్స్ అంటున్నారు. కాస్ట్లీ మెడిసిన్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ మెడికల్ షాపుల్లో తెచ్చుకుంటున్నారు. ట్రీట్మెంట్ ఫ్రీగా అందుతున్నా.. మెడిసిన్ కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు.  

నిధుల కొరత

నీలోఫర్ లో బెడ్స్ కొరత ఉండడంతో.. 6 వందల బెడ్స్ కెపాసిటీ తో కొత్త బిల్డింగ్ ను కడుతున్నారు. కరోనా తర్వాత నీలోఫర్ లో ఆ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. దీనికి తోడు నిధుల కొరత ఉండడంతో డెవలప్మెంట్స్ కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద ఆధారపడుతోన్నారు అధికారులు. బెడ్స్, ఇంక్యుబేటర్స్, ఆక్సిజన్ కోసం.. సీఎస్ఆర్ యాక్టివిటీతోటే పనులు అవుతున్నాయి. అంతేకాక సీఎస్ఆర్ ఫండ్స్ కోసం అధికారులే కంపెనీలను అడుగున్నారని తెలుస్తోంది. కొత్త బిల్డింగ్ అందుబాటులోకి వచ్చినా.. డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలంటున్నారు పబ్లిక్. ప్రస్తుతం బెడ్స్ పెంపుతో పాటు స్టాఫ్ ను కూడా పెంచాలంటున్నారు.