గంజాయితో వెళ్తున్న కారులో మంటలు.. నిందితులు పరార్..

గంజాయితో వెళ్తున్న కారులో మంటలు.. నిందితులు పరార్..

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ ను కట్టడి చేస్తున్నారు పోలీసులు. అయినప్పటికీ తరచూ ఎక్కడో ఒక చోట డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వస్తూనే ఉంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. అయితే.. గంజాయి తరలిస్తున్న కారులో మంటలు రావడంతో కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు నిందితులు. మంగళవారం ( అక్టోబర్ 14 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర జరిగింది ఈ ఘటన. గంజాయి తరలిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నడిరోడ్డుపై కారులో మంటలు చెలరేగడంతో స్థానికులు గుమిగూడారు. దీంతో భయపడ్డ నిందితులు కారు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

►ALSO READ | పోలీసులకు పాస్‎వర్డ్ చెప్పాల్సిందే: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకొని స్టేషన్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.