- 2035 నాటికి ప్రపంచ టాప్- 500లో మన వర్సిటీలు ఉండేలా టార్గెట్
- సింగపూర్, దుబాయ్ తరహాలో మన దగ్గర ఫారిన్ వర్సిటీల బ్రాంచులు
- ‘స్టడీ ఇన్ తెలంగాణ’ పేరుతో విదేశీ స్టూడెంట్లకు రెడ్ కార్పెట్
- విజన్ డాక్యుమెంట్ రెడీ చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ మన పిల్లలు డిగ్రీలు, పీజీల కోసం అమెరికా, లండన్ బాట పడుతుండగా.. ఇకపై ఫారిన్ స్టూడెంట్లు బ్యాగులేసుకొని మన దగ్గరికి క్యూ కట్టేలా భారీ ప్లాన్ వేసింది. ఇందుకోసం తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) ‘విజన్ డాక్యుమెంట్’ను రెడీ చేసింది. ‘ఇన్నోవేషన్, క్వాలిటీ, రీసెర్చ్’ అనే మూడు పిల్లర్ల మీద ఈ డాక్యుమెంట్‌ను రూపొందించారు.
రాబోయే పదేండ్లలో మన వర్సిటీల రేంజ్‌ను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లడమే మెయిన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలంటే.. దానికి తగ్గట్టు స్కిల్స్ ఉన్నోళ్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ మెగా ప్లాన్‌ను కౌన్సిల్ అధికారులు తెరపైకి తెచ్చారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 8న రిలీజ్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాల్లోనూ ఇంటర్నేషనల్ స్థాయి చదువులు అందించేలా ప్లాన్ రెడీ చేశారు.
దీనికోసం వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌లాంటి ప్రధాన నగరాల్లో ‘ఎడ్యుసిటీ’లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడ వర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లు, స్టార్టప్ ఇంక్యుబేటర్లు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. స్టూడెంట్లకు ఇంటర్నేషనల్ స్థాయి హాస్టళ్లు, ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయి. దీన్ని దశలవారీగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ప్రపోజల్స్ పెట్టారు.
స్టడీ ఇన్ తెలంగాణ..
విదేశీ స్టూడెంట్లను ఆకర్షించేందుకు ‘స్టడీ ఇన్ తెలంగాణ’ పేరుతో గ్లోబల్ క్యాంపెయిన్ షురూ చేయాలనే ప్రతిపాదనను కౌన్సిల్ చేసింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల నుంచి స్టూడెంట్లను రప్పించేలా ప్లాన్ చేశారు. సింగపూర్, దుబాయ్ తరహాలో మన దగ్గర ఫారిన్ వర్సిటీల బ్రాంచులు ఏర్పాటు చేయనున్నారు.
స్పెషల్ వెబ్‌సైట్, వీసా ప్రాసెస్ ను సులభతరం చేయడం, స్పెషల్ హాస్టళ్లు, సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం, ఇంటర్నేషనల్ అకాడమిక్ ఎక్స్చేంజ్ కౌన్సిల్ ఏర్పాటులాంటి చర్యలు చేపట్టాలని ప్రపోజల్స్‌లో పేర్కొన్నారు. ఏటా 50 శాతం మేర విదేశీ విద్యార్థుల సంఖ్య పెంచాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.
ఫారిన్ వర్సిటీలతో దోస్తీ..
ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకారం.. భవిష్యత్తులో మన వర్సిటీలు విదేశీ వర్సిటీలతో కలిసి పనిచేస్తాయి. జాయింట్ డిగ్రీలు, ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే సగం చదువు ఇక్కడ, సగం ఫారిన్‌లో చదివే చాన్స్ మనోళ్లకు దొరకనున్నది. మరోపక్క కాలేజీల్లో డిజిటల్ బోర్డులు, హైస్పీడ్ ఇంటర్నెట్, గ్రీన్ బిల్డింగ్స్, ఏఐ టూల్స్‌తో చదువులు సాగుతాయి. వర్సిటీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వనున్నారు. 2035 నాటికి ప్రపంచ టాప్- 500లో మన వర్సిటీలు ఉండేలా టార్గెట్ పెట్టుకున్నారు. పనితీరు బాగుండాలనే కండిషన్ పెట్టనున్నారు. న్యాక్ గ్రేడింగ్, ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ ఆధారంగానే ఫండింగ్ ఉంటుంది. క్వాలిటీ విషయంలో రాజీపడేదే లేదని తేల్చి చెప్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూసేందుకు ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ ఏర్పాటు చేస్తున్నారు. వరల్డ్ బ్యాంక్, యునెస్కోలాంటి సంస్థల నుంచి గ్రాంట్లు పొందేలా ప్లాన్ రెడీ చేశారు. వీటితో పాటు కార్పొరేట్ కంపెనీల నుంచి సీఎస్ఆర్ నిధులనూ సేకరించనున్నారు. మరోపక్క ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్ధతిలో హాస్టళ్లు, ల్యాబ్‌ల నిర్మాణం చేపట్టనున్నారు.
మన దగ్గర నుంచే గ్లోబల్ లీడర్లు..
అందరి భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చే ప్లాన్ ఇది. విజన్ డాక్యుమెంట్‌లో టీజీసీహెచ్ తరఫున దీన్ని సర్కారుకు ప్రతిపాదిస్తున్నాం. ఈ ప్లాన్ సక్సెస్ అయితే మన దగ్గరి నుంచే గ్లోబల్ లీడర్లు తయారవుతారు. తెలంగాణ దగ్గర టాలెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు కావాల్సింది సరైన ప్లానింగ్, పెట్టుబడి మాత్రమే. ఈ విజన్ డాక్యుమెంట్‌తో తెలంగాణను ప్రపంచ విద్యా పటంలో నిలబెడతాం.- బాలకిష్టారెడ్డి, టీజీసీహెచ్ఈ చైర్మన్
