న్యూఢిల్లీ: ఇండియాతో వాణిజ్య చర్చలు జరిపేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) బృందం సోమవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కానుంది. ఈయూ డైరెక్టరేట్-జనరల్ ఫర్ ట్రేడ్ సబీన్ వెయాండ్ నేతృత్వంలోని బృందం వస్తువులు, సేవలపై ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు ఇండియా వచ్చింది. ఈ సంవత్సరం చివరినాటికి చర్చలు ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇరు వర్గాలు స్టీల్, కార్బన్ ట్యాక్స్, ఆటోమొబైల్స్, నాన్-టారిఫ్ బారియర్స్ సంబంధిత అంశాలపై ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు.
కాగా, ఈయూ, ఇండియా మధ్య ఎఫ్‌టీఏ చర్చలు 2013లో నిలిచిపోగా, 2022లో మళ్లీ ప్రారంభమయ్యాయి. 2024–25లో భారత్–ఈయూ ద్వైపాక్షిక వాణిజ్యం 136.53 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్ ఎగుమతుల్లో 17 శాతం యూరప్‌కి వెళుతుండగా, ఈయూ ఎగుమతుల్లో 9 శాతం భారత్‌కి వస్తున్నాయి. ఆటోమొబైల్స్, మెడికల్ డివైజ్‌లపై డ్యూటీ తగ్గింపు, వైన్, స్పిరిట్స్, మాంసం, పౌల్ట్రీపై పన్ను తగ్గింపు, బలమైన ఐపీ రెగ్యులేషన్స్ విధానం వంటివి ఈయూ కోరుతోంది. ఒప్పందం కుదిరితే భారతీయ గార్మెంట్స్, ఫార్మా, స్టీల్, పెట్రోలియం, ఎలక్ట్రికల్ మెషినరీ ఈయూ మార్కెట్లో మరింత పోటీగా మారతాయి. ఎఫ్‌టీఏ చర్చలు 23 పాలసీ విభాగాలను కవర్ చేస్తున్నాయి.
