- ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సతీమణి, బీర్ల ఫౌండేషన్ చైర్ పర్సన్ బీర్ల అనిత
యాదగిరిగుట్ట, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు సర్పంచులుగా ఉంటేనే గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సతీమణి, బీర్ల ఫౌండేషన్ చైర్ పర్సన్ బీర్ల అనిత సూచించారు. సోమవారం యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కళ్లెం జహంగీర్ గౌడ్, వార్డు అభ్యర్థులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలను కలిసి కాంగ్రెస్ సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని, తద్వారా గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయన్నారు.
సొంత డబ్బులతో గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో.. కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాసాయిపేటలో కాంగ్రెస్ సర్పంచ్ లేకున్నా రెండేళ్లలో దాదాపుగా రూ.2 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని, మరో రూ.2 కోట్ల పనులకు ప్రపోజల్స్ పంపామని పేర్కొన్నారు. గ్రామంలో 32 మందికి ఇందిరమ్మ ఇండ్లు, 70 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయించామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటేయాలని సూచించారు. మాసాయిపేట సర్పంచ్ గా కళ్లెం జహంగీర్ గౌడ్ ను గెలిపిస్తే.. ఆదర్శ గ్రామంగా మాసాయిపేటను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు సత్యప్రకాశ్ గౌడ్, మాజీ వార్డు సభ్యురాలు కళ్లెం విజయ, మండల నాయకుడు కోల కృష్ణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు తదితరులుఉన్నారు.

