
- పరారీలో మరో ముగ్గురు
- రూ.99 లక్షల పాత నోట్లు స్వాధీనం
పద్మారావు నగర్, వెలుగు : రద్దు అయిన పాత 1000, 500 నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్న నలుగురిని బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను బేగంపేట ఇన్స్‌పెక్టర్ ప్రసాదరావు ఆదివారం మీడియాకు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కొత్త మల్లేశ్వర్, బుర్ర శివకుమార్, పుట్టపల్లి రవీందర్‌రెడ్డి, సికింద్రాబాద్ నల్లగుట్టకు గొల్లమందల రవి రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. మహబూబ్‌నగర్‌కే చెందిన జెజ్జర్ల ఆనంద్‌రెడ్డికి కొత్త మల్లేశ్వర్‌తో పరిచయం ఏర్పడింది.
దీంతో ఆనంద్‌రెడ్డి తన వద్ద పాత కరెన్సీ నోట్లు ఉన్నాయని, వాటిని కొత్త నోట్లుగా మారిస్తే 20 శాతం కమిషన్ ఇస్తానని చెప్పాడు. ఇందుకు అంగీకరించిన మల్లేశ్వర్ ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ అయిన శివకుమార్, రవీందర్‌రెడ్డి, రవికి చెప్పాడు. ఈ క్రమంలో మల్లేశ్వర్ రెండు రోజుల కింద ఆనంద్‌రెడ్డికి ఇంటికి వెళ్లి అతడి నుంచి పాత 1000, 500 నోట్లను తీసుకున్నాడు. తర్వాత తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని టివోలి థియేటర్ వద్దకు రావాలని సూచించాడు.
సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు టివోలి థియేటర్ వద్దకు వెళ్లి మల్లేశ్వర్, శివకుమార్, రవీందర్‌రెడ్డి, రవిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.99 లక్షల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నోట్లు అందజేసిన జెజ్జర్ల ఆనంద్‌రెడ్డితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న గంగాధర్, కృష్ణ పరారీలో ఉన్నారని ఇన్స్‌పెక్టర్ తెలిపారు.