ఆడోళ్లను వేధిస్తే ఊర్లో ఉండనియ్యం

ఆడోళ్లను వేధిస్తే ఊర్లో ఉండనియ్యం
  • అమ్మాయిలు, మహిళల్ని గౌరవించాలె
  • అమర్యాదగా ప్రవర్తిస్తే శిక్ష పడేదాక పోరాడుతం
  • మహిళా సర్పంచి నిర్ణయం
  • కానుకుంట పంచాయతీ తీర్మానం

సంగారెడ్డి: ఆడ పిల్లలు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిని మా ఊర్లో ఉండనియ్యం. బాలికలు, మహిళల్ని  గౌరవించాలి… వారితో ఎవరన్న అమర్యాదగా మాట్లాడినా.. ప్రవర్తించినా గ్రామం నుంచి గెంటేసి పోలీసులకు అప్పగించి శిక్ష పడేదాక పోరాడుతాం. ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా వారికి గ్రామం రక్షణగా ఉంటుందని కానుకుంట గ్రామ పంచాయతీ మంగళవారం తీర్మానించింది. మహిళల భద్రత కోసం గ్రామంలో అందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట మహిళా సర్పంచ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో మహిళల రక్షణకై తీసుకున్న నిర్ణయాన్ని అన్ని వర్గాలు అభినందిస్తున్నాయి.

బాధ్యతగా ఉంటాం

ఇటీవల రాష్ట్రంలో ఆడపిల్లలు, మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, దాడులు పెరగడంతో తమవంతు బాధ్యతగా వారి రక్షణ కోసం ఈ నిర్ణయం తీసకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నీలమ్మ అంజయ్య, ఉప సర్పంచ్ పి.గోవర్ధన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సెక్రటరీ విద్యాధర్, వైస్ ఎంపీపీ మంజుల సమక్షంలో పంచాయతీ సభ్యులు సమావేశమై తీర్మానం పత్రాలపై సంతకాలు చేశారు. తీర్మానానికి కట్టుబడి పని చేస్తామని గ్రామ ప్రజల సమక్షంలో పంచాయతీ సభ్యులు ప్రమాణం చేశారు. కానుకుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంతో పాటు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు మహిళలు, ఆడ పిల్లల రక్షణ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సమాజంలో మార్పు వస్తుందని పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

మంచి నిర్ణయం 

మహిళల పట్ల రోజు రోజుకు పెరుగుతున్న అకృత్యాలను తగ్గించాలని గ్రామ స్థాయిలో ఇలాంటి తీర్మానాలు చేయడం మంచి నిర్ణయం.  సమాజంలోని ఆడవారికి పూర్తి భరోసా ఇచ్చే విధంగా ఓ మహిళా సర్పంచ్​ ముందుకు నడవడం గొప్ప విషయం. దీనికి ఉపసర్పంచ్, వాడ్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సహకరించి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి నిర్ణయాల వల్ల సమాజంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది.   ‑ శివకుమార్​గౌడ్​, జిల్లా జైలు సూరింటెండెంట్

బాధ్యతగా పని చేస్తాం

సమాజంలో బాధ్యాతారాహిత్యంతో మహిళలపై అత్యాచారాలు, వేధింపులు పెరుగుతున్నాయి. ఆడ పిల్లలు, మహిళల్ని రక్షించడం ప్రభుత్వం, పోలీసుల ఒక్కరి బాధ్యత మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరిది అని చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నం. మహిళల భద్రతకు మేము సైతం అండగా ఉంటాం. మా గ్రామంలో అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో చోటియ్యం. –నీలమ్మ అంజయ్య , గ్రామ  సర్పంచ్

ఆడ పిల్లల్ని కాపాడుకుంటం

ఆడ పిల్లలకు అండగా ఉండికాపాడుకుంటాం. పోకిరీల బెడద నుంచి మహిళలను, ఆడ పిల్లలను రక్షించేందుకు మా గ్రామంలో చేసిన తీర్మానం మిగతా పంచాయతీల్లో మార్పు తీసుకురావాలి. ప్రజల్లో చైతన్యం కోరుతూ చేపట్టిన ప్రమాణం అందరిని జాగృతం చేయాలి.‑ ఉదయ్ కుమార్,యువజన సంఘం నేత