
- కరీంనగర్ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో వెలుగులోకి మరో అక్రమం
- హైవే వెంట చేతులు మారిన 9.11 ఎకరాల లావుణి పట్టా భూమి
- పీఓటీ చట్టాన్ని అతిక్రమించి గంగాధర సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు తాజాగా 8 ఎకరాలకు
- కాంపౌండ్ వాల్ తిప్పిన కొనుగోలుదారులు
- భూ భారతి రికార్డుల్లో ఇంకా లావుణి పట్టాదారుల పేర్ల మీదే భూమి
- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రికార్డుల్లో మాత్రం కొనుగోలుదారుల పేర్లు
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖలో మరో అక్రమం వెలుగులోకి వచ్చింది. కొత్తపల్లి హవేలీ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 272లో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా కొందరు బడా వ్యాపారులు, లీడర్ల చేతిలోకి వెళ్లాయి. ప్రొహిబిటెడ్ జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. అవినీతి పాల్పడి పలువురు సబ్ రిజిస్ట్రార్లు పీఓటీ చట్టాన్ని అతిక్రమిస్తూ నాలుగు దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలానే కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా జగిత్యాల హైవే వెంట 9.11 ఎకరాల లావుణి పట్టా భూములు కూడా చేతులు మారాయి. ఓ వైపు గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు అవుతున్నా.. భూ భారతి రికార్డుల్లో ఇంకా11 మంది పాత లావుణి పట్టాదారుల పేర్ల మీదే భూమి చూపిస్తుండడం గమనార్హం.
272 సర్వే నంబర్ లో 24.24 ఎకరాలు
కొత్తపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా 272 సర్వే నంబర్ లోని 24.24 ఎకరాలకుగాను ఇందులో 15.13 ఎకరాలు భూ భారతి రికార్డుల్లో బై నంబర్ల వారీగా ప్రభుత్వ భూమిగా చూపిస్తోంది. దీనిలో కొంత స్కూల్ కు, నిరుపేదలకు ఇండ్ల స్థలాల కింద ఇవ్వగా, ఇంకో పదెకరాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా 9.11 ఎకరాల అసైన్డ్ భూమిని సాగు చేసుకునేందుకు 40 ఏండ్ల కింద కొందరు దళితులకు ప్రభుత్వం లావుణి పట్టాల కింద ఇచ్చింది.
వీటిని పొందిన రైతులు చనిపోతే వారసులకు హక్కులు వస్తాయే తప్ప.. ఇతరులకు అమ్మడం, కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా వీల్లేదు. కానీ 1984 నుంచి ఇప్పటి వరకు సబ్ రిజిస్ట్రార్ల సహకారంతో రిజిస్ట్రేషన్లు జరిగి అనర్హుల చేతుల్లోకి వెళ్లాయి. వీరిలో కరీంనగర్ కు చెందిన పలువురు వ్యాపారులు, పొలిటికల్ లీడర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆ భూముల విలువ బహిరంగ మార్కెట్ లో రూ.100 కోట్లపైనే ఉంటుందని అంచనా.
తప్పుదిద్దుకున్నట్లు చూపేందుకు సేల్ డీడ్స్ క్యాన్సిల్..?
గంగాధర సబ్ రిజిస్ట్రార్ నూర్ అఫ్జల్ ఖాన్ హయాం లో గతేడాది 9 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రెవెన్యూ రికార్డుల్లో జంగపల్లి మల్లయ్య పేరు మీద 272/14లో 20 గుంటలకు లావుణి పట్టా ఉంది. జంగపల్లి మల్లేశ్పేరుతో ఆయనే గత ఆర్నెళ్లలో 121 గజాలు, 242 గజాల చొప్పున 9 మందికి సేల్ డీడ్ ద్వారా అమ్మినట్టు ఈసీలో చూపిస్తోంది. ఇందుకు సబ్ రిజిస్ట్రార్ నూర్ అఫ్జల్ ఖాన్ పూర్తిగా సహకరించారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడం, ఎంక్వైరీ చేయడం, ఆ తర్వాత సస్పెన్షన్ వేటు ఖాయమైనట్లు సమాచారం తెలియగానే, ఆర్డర్ చేతికి అందకముందే ఈనెల 26, 28 తేదీల్లో ఆ రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేశారు. తన సస్పెన్షన్ పై లీగల్ గా ఫైట్ చేసి, త్వరగా జాబ్ లో చేరేందుకు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు ఇచ్చిన సూచనతోనే ఇలాంటి చర్యకు పాల్పడినట్టు ప్రచారంలో ఉంది.
మిగతా 50 రిజిస్ట్రేషన్ల సంగతేంటి ?
అదే సర్వే నంబర్ లో ప్రస్తుత లావుణి పట్టాదారుల నుంచి పలువురు తక్కువ ధరకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో ఈసీలను పరిశీలిస్తే 272 సర్వే నంబర్ లో బై నంబర్లలో 50కిపైగా రిజిస్ట్రేషన్లు అయినట్లు కనిపిస్తోంది. 272/14 సర్వే నంబర్ లోని 20 కుంటలపై ఫిర్యాదు అందడంతో 9 రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేసినప్పటికీ.. అదే పద్ధతిలో మిగతా 8.29 ఎకరాల్లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు, బాధ్యులైన సబ్ రిజిస్ట్రార్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఫిర్యాదు చేసేవరకు ఉన్నతాధికారులు ఎదురు చూస్తారా.. లేదా సుమోటాగా తీసుకుని ఎంక్వైరీ చేస్తారా..? అనే చర్చ జరుగుతోంది. గతంలో ఇదే కొత్తపల్లి పరిధిలో లోక్ సత్తా శ్రీనివాస్ న్యాయ పోరాటంతో లోకాయుక్త ఆదేశాల మేరకు 426 రిజిస్ట్రేషన్లు కలెక్టర్ క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. అక్రమ రిజిస్ట్రేషన్లకు కారణమైన అప్పటి సబ్ రిజిస్ట్రార్లపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేయాలి
కొత్తపల్లిలోని మెడికల్ కాలేజీ ఎదురుగా 272 సర్వే నంబర్ లో దళితుల కు ఇచ్చిన 9.11 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ అన్యాక్రాం తమయ్యాయి. ఆ సర్వే నంబర్ లో పేదలకు, స్కూల్ కు ఇచ్చిన ల్యాండ్ పోనూ మిగతా 10 ఎకరాలు కూడా కబ్జా అయ్యే ప్రమాదముంది. అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసిన ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ పైనే కాకుండా గత సబ్ రిజిస్ట్రార్ల పైనా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ భూముల ను రిజిస్ట్రేషన్ చేసుకున్న కొందరు పేరు, పలుకు బడి ఉన్నవాళ్లను ఆఫీసర్లు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా చేసిన అన్ని రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి. - పంజాల శ్రీనివాస్ సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి