
IT News: వారం ప్రారంభంలో దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ లేఆఫ్స్ గురించి చేసిన ప్రకటన టెక్ రంగంలో పెను ప్రకంపనలకు దారితీసింది. దీనంతటికీ ఏఐ కారణంగా అందరూ భావిస్తున్నప్పటికీ స్కిల్ గ్యాస్ అసలైన కారణంగా టాటా కన్సల్టెన్సీ సీఈవో చెప్పారు. అయితే ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగాల కొదవ ఉండబోదని మాత్రం టెక్ నిపుణులు పదేపదే చెబుతున్నారు.
ఈ క్రమంలోనే దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ నుంచి ఒక శుభవార్త వచ్చింది. ఒకపక్క సాంకేతిక రంగంలో ఏఐ వినియోగం కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ తాము కొత్త ఉద్యోగుల నియామకాన్ని కొనసాగించనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించటం గమనార్హం. ఈ ఏడాది మెుత్తంగా 20వేల మంది ఫ్రెషర్లను నియమించుకోబోతున్నట్లు సీఈవో సలీల్ పరేఖ్ చెప్పారు. ఇప్పటికే ఉన్న ఉద్యోగులను ఏఐ సాంకేతికతో రీస్కిల్లింగ్ చేస్తున్నట్లు ఐటీ దిగ్గజం వెల్లడించింది.
Also Read:-ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. వర్తించే పన్నులివే..
ప్రస్తుతం టెక్ రంగంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ తాము ఎలాంటి ఉద్యోగి తొలగింపులకు వెళ్లటం లేదని స్పష్టం చేశారు పరేఖ్. మెుదటి త్రైమాసికంలో 17వేల మందిని నియమించున్నట్లు పరేఖ్ చెప్పగా.. ఈ సంఖ్యను 20వేలకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. వీరిలో కాలేజ్ గ్రాడ్యుయేట్లు అధికంగా ఉంటారన్నారు. ఏఐతో పనిచేయటానికి ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యాలు కూడా చాలా ముఖ్యమని పరేఖ్ అన్నారు. అలాగే కాంప్రికేటెడ్ టెక్నాలజీలను రన్ చేసేందుకు మానవ ప్రమేయం కూడా చాలా కీలకంగా చెప్పారాయన.
తమ ప్రణాళికలో ఉద్యోగుల తొలగింపు ఊసే లేదని ఇన్ఫోసిస్ సీఈవో చెప్పిన మాటలు కంపెనీ ఉద్యోగులను ఊపిరి పీల్చుకునేలా చేయటంతో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఊపందుకుంటాయని ఆశలు పెరిగాయి. ఏఐతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ పై తమ ఫోకస్ కొనసాగుతున్నట్లు ఇన్ఫీ చెబుతోంది. అమెరికా యూరోపియన్ మార్కెట్లలో స్థిరత్వం వచ్చిన తర్వాత తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించటానికి సిద్ధంగా ఉన్నట్లు సీఈవో చెబుతున్నారు. ప్రస్తుతం ఏఐ వినియోగం ద్వారా కంపెనీలో ఉత్పాదకత 5 నుంచి 15 శాతం మధ్య మాత్రమే పెరిగినట్లు వెల్లడించారు పరేఖ్.