
Crypto Taxation: కొన్నేళ్ల కిందట కేవలం డిజిటల్ ప్రపంచానికి మాత్రమే పరిమితం అయిన క్రిప్టో ప్రస్తుతం ప్రజల ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఒక ఆస్తి పెట్టుబడిగా మారిపోయింది. ఈ క్రమంలో క్రిప్టోలతో ఉండే పన్నుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం క్రిప్టోలపై పన్నులు అలాగే భవిష్యత్తులో పరిస్థితులపై అవగాహన ఇన్వెస్టర్లకు అవసరం.
క్రిప్టో అసెట్ క్లాస్ అనుమతించబడిన పెట్టుబడి సాధనంగా మారటంతో దీనిపై రూల్స్ పెట్టుబడిదారుల్లో అవగాహనను పెంచుతున్నాయి. ఇది పెట్టుబడిదారులు పెరుగుదలకు దారితీయటంతో ఐటీ అధికారులు వారిపై దృష్టి కొనసాగిస్తున్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తొలిసారిగా వర్చువల్ డిజిటల్ అసెట్స్ అనే క్లాస్ ప్రకటించబడింది. ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 115బీబీహెచ్ కింద వీటి గురించి పేర్కొనబడింది.
క్రిప్టో పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలపై గరిష్ఠంగా 30 శాతం ఫ్లాట్ రేటు పన్నుతో పాటు.. 4 శాతం సెస్, సర్ ఛార్జ్ కూడా వర్తిస్తుంది. అయితే క్రిప్టో పెట్టుబడి నష్టాలను ఆఫ్ సెట్ చేసుకునేందుకు ఎలాంటి అవకాశం కల్పించలేదు భారత ప్రభుత్వం. అలాగే ఎలాంటి మినహాయింపులను కూడా అందించలేదు. చట్ట ప్రకారం రూ.10వేలకు మించిన క్రిప్టో ట్రాన్సాక్షన్లపై 1 శాతం టీడీఎస్ ను జూలై 1, 2022 నుంచి అమలులోకి తీసుకొచ్చారు. దీనికారణంగా క్రిప్టో ట్రాన్సాక్షన్లలో లాభం వచ్చినా లేదా నష్టం వచ్చినా టీడీఎస్ మాత్రం తప్పక చెల్లించాల్సిందే. క్రిప్టో కాయిన్లను వస్తుసేవల చెల్లింపులకు వినియోగించినా కూడా పన్నులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. భారతదేశంలో క్రిప్టో పెట్టుబడులపై ఉన్న కఠిన పన్ను విధానాలతో దాదాపు 90 శాతం మంది విదేశాలకు మైగ్రేట్ అయినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రానున్న కొన్నేళ్లలో పన్ను సంస్కరణలు, నష్టాల భర్తీ, టీడీఎస్ తగ్గింపు వచ్చి ప్రోత్సాహక మార్పులు ఉండొచ్చని క్రిప్టో పరిశ్రమ భావిస్తోంది.
►ALSO READ | IPO News: దుమ్మురేపిన ఐపీవో.. అడుగుపెట్టగానే 50 శాతం లాభం.. అంచనాలకు మించి..
2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి షెడ్యూల్ చేయబడిన క్రిప్టో ఆస్తులను కూడా ఆదాయపు పన్నులో ఫైల్ చేయాల్సి ఉంటుందని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ క్రమంలో దేశంలోని క్రిప్టో ఎక్స్ఛేంజీలను, వ్యక్తులను వాటికి సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగా పంచుకోవాలని పేర్కొంది. వీటి వివరాలు దాచాలనుకునేవారు రిస్క్ లో పడతారు. ఇప్పటికే క్రిప్టో పరిశ్రమ 1 శాతంగా ఉన్న టీడీఎస్ 0.1 శాతానికి తగ్గించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న భారత క్రిప్టో ఆర్థిక వ్యవస్థకు ఇది లాభదాయకమైన మార్పుగా మారుతుందని పరిశ్రమ చెబుతోంది. ప్రస్తుతం మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిణామాల్లో భారత్ డిజిటల్ ఫైనాన్స్ విభాగంలో కీలక ఆటగాడిగా మారుతుందని భావిస్తున్నట్లు జియోటస్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ అభిప్రాయపడుతోంది. ఇది కేవలం బాధ్యతాయుతమైన ప్రోత్సాహకర వాతావరణం వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుందని జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు.