
GNG Electronics IPO: భారత స్టాక్ మార్కెట్లలో ఈక్విటీలు ఎలా ఉన్నప్పటికీ ఐపీవోలు మాత్రం దుమ్ముదులిపేస్తు్న్నాయి. గ్రేమార్కెట్ అంచనాలకు మించిన రాబడులతో అందరినీ షాక్ కి గురిచేస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు మరింతగా కొత్త ఐపీవోలపై ఆసక్తి చూపుతూ ముందుకు సాగుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జీఎన్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఐపీవో గురించే. కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈలో 50 శాతం ప్రీమియం ధర రూ.355 వద్ద జాబితా అయ్యాయి. వాస్తవానికి కంపెనీ ఐపీవో ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.225 నుంచి రూ.237గా ప్రకటించింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.460 కోట్లను దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విజయవంతంగా సమీకరించింది.
క్వాలిఫైడ్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి భారీగా డిమాండ్ చూసిన ఐపీవో గ్రేమార్కెట్లో 38 శాతం ప్రీమియం రేటు పలికింది. అయితే జూలై 23 నుంచి జూలై 25 వరకు తెరచి ఉంచబడిన ఐపీవో 147 సార్లు ఓవర్ సబ్ స్క్రిప్షన్ చూడటంతో చివరికి ఇన్వెస్టర్ల ఊహలకు కూడా అందని లాభాలకు మార్కెట్లో లిస్ట్ అయ్యింది.
బ్రోకరేజీలు ఏమంటున్నాయో పరిశీలిస్తే.. మెహతా ఈక్విటీస్ నిపుణుడు ప్రశాంత్ తాస్పే ఇన్వెస్టర్లను లాభాలు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఎక్కువ రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులకు ఐపీవో షేర్లను హోల్డ్ చేయెుచ్చని చెప్పారు. అలాగే ఆనంద్ రాఠీ బ్రోకింగ్ నిపుణులు నరేంద్ర సోలంకి కూడా కంపెనీ షేర్లపై సానుకూలతను వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహం కలిగి ఉంటే ఐపీవోలో పెట్టుబడి ఉత్తమంగా గతంలోనే ఆయన సూచించిన సంగతి తెలిసిందే.
కంపెనీ వ్యాపారం..
2006లో స్థాపించబడిన GNG ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, ICT పరికరాలకు రిఫర్బిషింగ్ సేవలను అందిస్తుంది. కంపెనీ కర్యకలాపాలు ఇండియాతో పాటు అమెరికా, యూరప్, ఆఫ్రికా, యూఏఈ వ్యాప్తంగా విస్తరించాయి. కంపెనీ ఎలక్ట్రానిక్స్ బజార్ బ్రాండ్ పేరు కింద తన సేవలను కొనసాగిస్తోంది. విజయా సేల్స్, హెచ్ పీ, లెనోవో వంటి సంస్థలకు దేశంలో ల్యాప్ టాప్స్, డెస్క్ టాప్స్ బైబ్యాక్ కోసం సేవలను అందిస్తోంది.