
- ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌లో అవకతవకలు
- 16 మంది మెడికల్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు
- ఇప్పటికే ఏఎంసీలు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు షోకాజ్
- మరో 10 మందికి బిల్ కలెక్టర్లకు మెమో
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో పలువురు సిబ్బంది, ఉద్యోగులను వరుస ట్రాన్స్ ఫర్లు చేస్తూ నోటీసులు ఇస్తుండడంతో వారిలో టెన్షన్ మొదలైంది. ఫేస్ రికగ్నేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) అటెండెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న 16 మంది మెడికల్ ఆఫీసర్లకు వారం కిందట షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అటెండెన్స్ లేకుండానే జీతాలు ఎందుకు చెల్లించారని, వర్కర్ల అటెండెన్స్ విషయాన్ని పట్టించుకోకుండా ఎందుకు జీతాలు ఇచ్చారని నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. అలాగే, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన13 మంది బిల్ కలెక్టర్లకు ఈ నెల 9న కమిషనర్ ఆర్వీ కర్ణన్ మెమోలు ఇచ్చారు.
పద్ధతి మారకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో పనితీరు ఆధారంగా ఈ నెల 23న ఏడుగురు సూపరింటెండెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ మున్సిపల్కమిషనర్లను బదిలీ చేయగా.. పనితీరు బాగాలేదని గత నెల 28న 10 మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, 10 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు,10 మంది బిల్ కలెక్టర్లుకు అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి షోకాజు నోటీసులిచ్చారు. ఈ నెలలోనే ఏకంగా 23 మంది డిప్యూటీ కమిషనర్లను కమిషనర్ బదిలీ చేశారు.
నెల వ్యవధిలోనే..
ఒక్కనెల వ్యవధిలోనే బల్దియాలో ఉద్యోగులు, సిబ్బందిని బదిలీలు చేయడమే కాకుండా నోటీసులు జారీ చేయడంతో విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వారిలో ఆందోళన మొదలైంది. కమిషనర్ కర్ణన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనని భయపడుతున్నారు. కాగా, ఎవరెవరు ఏం పని చేస్తున్నారు? ఇచ్చిన పని చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నవారెవరు ? అన్న విషయాలపై కమిషనర్ దృష్టి పెట్టినట్టు సమాచారం. అటువంటి వారి వివరాలు సేకరిస్తున్న కమిషనర్ ఇంకొందరిపై కూడా చర్యలకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇటీవల బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లకు అడ్వర్టైజ్ మెంట్, ట్రేడ్ లైసెన్సుల బాధ్యతలను అప్పగించారు. అయితే, ఇలాంటి నిర్ణయాల వల్ల తమపై పనిఒత్తిడి పెరిగిందని కొంతమంది ఆందోళనకు దిగారు. ఈ విషయంంలో ఉద్యోగులు రచ్చకెక్కడంపై కూడా కమిషనర్ సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది.
మూడు నెలల్లో కర్ణన్ మార్క్....
ఆర్వీ కర్ణన్ జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి నేటికి మూడు నెలలైంది. ఈ మూడునెలల్లో ప్రజలకు బాధ్యులై పని చేయని వారిపైనే చర్యలు తీసుకుంటున్నారని కొందరు అధికారులు చెప్తున్నారు. వేతనాలు తీసుకుంటూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై ఎప్పటికప్పుడు యాక్షన్తీసుకుంటున్నారు. కమిషనర్ గా చార్జ్ తీసుకున్న వెంటనే బర్త్ అండ్ డెత్‌సర్టిఫికెట్లు అక్రమంగా జారీ అవుతున్నాయని గుర్తించి, దానిపై విచారణ జరిపించి 17 మంది ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు.
వారిని ఏకంగా విధుల నుంచి తొలగించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొసమెరుపు ఏమిటంటే..జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరుపైనే కాకుండా వారు ఏమైనా అక్రమాలకు పాల్పడుతున్నారా? అన్న కోణంలో ఇంటిలిజెన్స్ విచారణ జరిపిస్తున్నట్టు సమాచారం.