చంపేస్తున్న రోడ్డు ప్రమాదాలు.. ప్రతి రోజూ గాల్లో కలుస్తున్న 3 వేల 200 మంది ప్రాణాలు

చంపేస్తున్న రోడ్డు ప్రమాదాలు.. ప్రతి రోజూ గాల్లో కలుస్తున్న 3 వేల 200 మంది ప్రాణాలు

పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, శాస్త్ర సాంకేతిక పురోగతివల్ల  సుదూర ప్రాంతాలకు ప్రయాణించడం రోజురోజుకూ నిత్యకృత్యంగా మారింది. పట్టణ ప్రాంతాల్లో చాలామంది తాము పని చేసే ప్రదేశానికి చేరుకోవడానికి  వందల కిలోమీటర్లు  ప్రయాణించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తక్కువ వ్యవధిలో  ఎక్కువ దూరాలను కవర్ చేసే వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఆటోమొబైల్ పరిశ్రమలో పోటీ నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో చాలామంది  రెండు లేదా నాలుగు చక్రాల సొంత వాహనాలను కలిగి ఉండటానికి ఇష్టపడతారు. ఇది ఒక అవసరం కావడంతో పాటు హోదా చిహ్నంగా కూడా మారింది. గత దశాబ్దంలో ముఖ్యంగా నాలుగు చక్రాల వాహనాల ఉత్పత్తిలో  భారీ పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల ముఖ్యంగా పట్టణవాసుల ప్రయాణ సమస్యలను అధిగమించడానికి సహాయపడింది. అదే సమయంలో ఇది రోడ్డుపై భద్రతా సమస్యలకు తీవ్రమైన ఇబ్బందులను సృష్టిస్తోంది.

డబ్ల్యూహెచ్ఓ  నివేదిక ప్రకారం.. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల ఫలితంగా దాదాపు 1.2 మిలియన్ల మంది మరణిస్తున్నారు.  అనగా ప్రతి రోజూ 3,200 కంటే ఎక్కువమంది మరణిస్తున్నారు. అంతేకాకుండా, ఇరవై నుంచి యాభై మిలియన్ల మంది ప్రజలు వాహనాలు  ఢీకొనడం వల్ల  గాయాలకు గురవుతున్నారు. ఈ గాయాలు ప్రపంచవ్యాప్తంగా అంగవైకల్యానికి ఒక ముఖ్యమైన కారణంగా నిలిచింది. రోడ్డుట్రాఫిక్ మరణాలలో 92శాతం దిగువ, మధ్య ఆదాయ దేశాలలో సంభవిస్తున్నాయి.  ఇవి ప్రపంచంలోని రిజిస్టర్డ్ వాహన సముదాయంలో సగంకంటే ఎక్కువ. ప్రతి సంవత్సరం మనదేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో 1.7లక్షల మంది మరణిస్తున్నారు, దాదాపు అర మిలియన్ మంది గాయాలబారిన పడుతున్నారు. అలాగే, రోడ్డుప్రమాదాల వల్ల స్థూల జాతీయోత్పత్తిలో 3% నష్టం వాటిల్లుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంతో పెరుగుతున్న ఆందోళనకు ప్రతిస్పందనగా ఐక్యరాజ్యసమితి 2020 సెప్టెంబర్ నెలలో ప్రపంచ రహదారి భద్రతను మెరుగుపరచడం అనే తీర్మానాన్ని ఆమోదించింది.  2021-– 2030 దశాబ్దపు రోడ్డు భద్రత కోసం కార్యాచరణను ప్రకటించింది.  2030 నాటికి  ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల మరణాలు, గాయాల సంఖ్యను సగానికి తగ్గించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించింది.  ఈ కార్యాచరణ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, పౌరసమాజం,  ప్రైవేట్ రంగం కలిసి రోడ్లు, వాహనాల భద్రతను మెరుగుపరచడానికి 
డ్రైవర్లు,  ప్రయాణికులు, పాదచారులకు సురక్షితమైన ప్రవర్తనపై అవగాహన కల్పించడానికి ఒక చట్రాన్ని అందిస్తుంది. 

2022లో 4,61,312 రోడ్డు ప్రమాదాలు
రోడ్డు భద్రతకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తున్నప్పటికీ  డబ్ల్యూహెచ్ఓ నివేదికలు... భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో లక్ష్యాన్ని సాధించేందుకు ఇంకా చాలా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాయి.  2022లో  మనదేశంలో మొత్తం 4,61,312 రోడ్డుప్రమాదాలు నమోదయ్యాయి.  అందులో 1,68,491 మంది ప్రాణాలు కోల్పోగా 4,43,366 మంది గాయపడ్డారు. 2023 నాటికి మరణాల సంఖ్య 1.80 లక్షలకు చేరింది.  ఐఐటీ  ఢిల్లీకి  చెందిన ఇండియా స్టేటస్ రిపోర్ట్ ఆన్  రోడ్  సేఫ్టీ  2024 ప్రకారం..  రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించే అంతర్జాతీయ లక్ష్యాలను చేరుకోవడంలో భారతదేశం అంత పురోగతి సాధించడంలేదని తెలుస్తోంది.

భారతదేశంలో  ప్రమాదవశాత్తు గాయాల కారణంగా జరిగే మరణాలలో 43.7%తో  రోడ్డు ప్రమాదాలు ప్రధాన కారణమవుతున్నాయి. అయితే, రోడ్డు ప్రమాదాలతో పాటు దేశ జనాభా, వాహనాల సంఖ్య కూడా భారీగా పెరగడం  జరిగింది.  దేశంలో 1951లో  భారతదేశ జనాభా 361 మిలియన్లు ఉండగా 2011 మార్చి 1 నాటికి భారతదేశ జనాభా 1,210మిలియన్లుగా ఉంది. 2026 నాటికి దాదాపు 1.417 మిలియన్లుగా అంచనా వేయడమైనది.  1951లో 17.61%  లేదా  62 మిలియన్లు ఉన్న పట్టణ జనాభా  2011 నాటికి 31.16% లేదా 377 మిలియన్లకు పెరిగింది.  ఈ సంఖ్య 2026 నాటికి 40శాతం పెరిగే అవకాశం ఉంది. 

జనాభాతో పాటు పెరిగిన వాహనాల సంఖ్య
జనాభాతోపాటు భారతదేశంలో నమోదైన మోటారు వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 1951 మార్చి నాటికి దాదాపు 0.3 మిలియన్ల నుంచి 2022 మార్చి నాటికి దాదాపు 354 మిలియన్లకు పెరిగింది. 2024 నాటికి  మనదేశం దాదాపు 6.7 మిలియన్  కిలోమీటర్ల  రోడ్డు కలిగి  ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌గల  దేశంగా నిలిచింది.  ఇందులో జాతీయ రహదారుల నెట్‌‌‌‌వర్క్ దాదాపు 146,195 కి.మీ  విస్తరించి ఉంది.

అయితే, పట్టణాల సంఖ పెరుగుతున్నా అక్కడి జనాభాకు తగ్గట్టుగా రోడ్ల  విస్తీర్ణత లేదు.  రోడ్డు ప్రమాదాలకు  ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.  ఈ మరణాలలో 75% అతివేగం ప్రధాన కారణంగా సంభవిస్తున్నాయి.   హెల్మెట్ ధరించకపోవడం, సీటుబెల్టులు ధరించకపోవడం, రాంగ్​సైడ్​  డ్రైవింగ్ చేయడం,  మద్యం ప్రభావంతో డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు ప్రధాన కారణాలవుతున్నాయి. 

ఐఆర్సీ మార్గదర్శకాలు పాటించాలి
రోడ్డు ప్రమాదాలకు ఓవర్‌‌‌‌ లోడింగ్,  లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం కూడా కారణం అవుతున్నాయి.  రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారిలో 66 శాతం మంది 18-–34 సంవత్సరాల వయస్సుగలవారు ఉన్నారు.  ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) ప్రమాణాలు, మార్గదర్శకాలను  పాటించకపోవడంతో కూడా రోడ్డుప్రమాదాలు పెరుగుతున్నాయి.  రోడ్డు ప్రమాదాల నివారణకు ఐఆర్సీ మార్గదర్శకాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  వివిధ ట్రాఫిక్ నిర్వహణ సంస్థల మధ్య సమన్వయం లోపించడం, మోటార్​ వెహికల్ నిబంధనలను  పాటించడంలో నిర్లక్ష్యం వహించడం జరుగుతున్నది.  డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల తనిఖీలలో నిర్లక్ష్యంతోపాటు వాహనదారులకు అవగాహన కల్పించడంలో  విఫలం చెందడంతో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ  పెరుగుతున్నాయి.  2018లో  ఆస్ట్రియా  రాజధాని  వియన్నా నగరంలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక పోలీసు సదస్సులో  నాతోపాటు పాల్గొన్న కొందరు ఇతర దేశాల ప్రతినిధులు పై కారణాలతో ఏకీభవించడం జరిగింది.  ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు సమర్థవంతమైన,  సురక్షితమైన రవాణా వ్యవస్థ ఎంతో ముఖ్యమని నొక్కి చెప్పడం జరిగింది.

డా. సురేందర్ అడికి, రోడ్ ట్రాఫిక్​ రీసెర్చర్