మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల సెగ

మహబూబ్ నగర్ జిల్లాలో  మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల సెగ
  •     ఆఖరి నిమిషంలో ‘బీ-ఫామ్’ చిక్కులు!

వనపర్తి,  వెలుగు :  మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉమ్మడి పాలమూరు జిల్లాలో తీవ్ర అసమ్మతికి దారితీసింది. వనపర్తి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ మధ్య సాగింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిలు వార్ రూమ్‌లో అభ్యర్థులపై కసరత్తు చేయగా, పాత కొత్త నేతల మధ్య టిక్కెట్ల పోరు రసాభాసగా మారింది.

ముఖ్యంగా చిన్నారెడ్డి వర్గం తమకు ప్రాధాన్యత తగ్గడంపై అసహనం వ్యక్తం చేయగా, మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తున్నారంటూ కార్యకర్తలు డీసీసీ ఆఫీసులో ఆందోళనకు దిగారు.

మరోవైపు, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే చివరి నిమిషంలో 7, 25వ వార్డుల అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేయడంతో వారు మున్సిపల్ కార్యాలయానికి సకాలంలో చేరుకోలేకపోయారు. స్థానిక నాయకుల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య నక్క సుజాత (7వ వార్డు), కదిరె రాములు (25వ వార్డు) పార్టీ గుర్తు కోల్పోయి, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆమనగల్లు బీఆర్ఎస్‌లో ‘బీ-ఫామ్’ చిచ్చు

ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీలోని 15 వార్డులకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం పట్టణంలోని ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి సమక్షంలో జరిగిన బీ-ఫామ్‌ల పంపిణీ కార్యక్రమంలో నిరసన వ్యక్తమైంది. 14వ వార్డు అభ్యర్థిగా వస్పుల సాయిలు పేరును ప్రకటించడంతో, అదే సీటు ఆశించిన వస్పుల సుగుణ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత నెల రోజులుగా వార్డులో ప్రచారం చేసుకుంటున్న తమకు కాదని వేరొకరికి టిక్కెట్ ఎలా ఇస్తారని మాజీ ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో ఆగ్రహించిన కార్యకర్తలు ఫంక్షన్ హాల్‌లోని కుర్చీలను విరగ్గొట్టి ఆందోళన చేపట్టారు. చివరకు నేతలు నచ్చజెప్పారు. తోపులాటలలు, అసమ్మతి సెగ నడుమ అభ్యర్థులకు బీ-ఫామ్‌లను అందజేశారు.

నేతల రాజీనామాలు..

నాగర్​ కర్నూల్ : తనకు కాకుండా వేరేవారికి సీటు ఇవ్వండంతో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 6వ వార్డులో టిక్కెట్ ఆశించిన పార్లమెంట్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ తైలీ శ్రీనివాసులు, అలాగే కల్వకుర్తి 11వ వార్డులో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది మల్లెపల్లి జగన్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ప్రకటించారు.  

10వ వార్డులో బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించిన కుడుముల మనోహర్ రెడ్డి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెబెల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు.  నాగర్​కర్నూల్​ మున్సిపాలిటీలోని 15వ వార్డు ఎన్నిక రాజకీయం రణరంగాన్ని తలపించింది. చివరికి బీఆర్ఎస్ అభ్యర్థిగానే బరిలో ఉంటానని నసీమా బేగం స్పష్టం చేస్తూ, పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి తన బీ-ఫామ్‌ను సమర్పించారు.

గద్వాల కాంగ్రెస్‌లో ‘బీ-ఫామ్’ హైడ్రామా

గద్వాల  : గద్వాల మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నెలకొంది. ఎమ్మెల్యే వర్గానికి 30, సరిత వర్గానికి 7 బీ-ఫామ్‌లు కేటాయించి సయోధ్య కుదిర్చినట్లు కనిపించినా, అసలు మలుపు నామినేషన్ల ముగింపు సమయంలో చోటుచేసుకుంది.

సరిత వర్గానికి చెందిన ఏడుగురు అభ్యర్థులు బీ-ఫామ్‌లు సమర్పించినప్పటికీ, ఎమ్మెల్యే వర్గానికి చెందిన 37 మందినే పార్టీ అభ్యర్థులుగా గుర్తిస్తూ డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి ‘సి-ఫామ్’ సమర్పించడంతో సరిత అనుచరులకు నిరాశే మిగిలింది. ఇది పార్టీలో జరిగిన కేవలం ‘మిస్ కమ్యూనికేషన్’ మాత్రమేనని రాజీవ్ రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, టిక్కెట్లు ఆశించి భంగపడ్డ 13 మంది నేతలు బీఆర్ఎస్‌లో చేరడం, మరికొందరు స్వతంత్రులుగా బరిలో నిలవడంతో కాంగ్రెస్‌కు రెబల్స్ సెగ తప్పేలా లేదు.