కార్తీక మాసంలో రోజూ కాకపోయినా ఈ కార్తీక పౌర్ణమి ఒక్కరోజు ఇలా చేసినా చాలు !

కార్తీక మాసంలో రోజూ కాకపోయినా ఈ కార్తీక పౌర్ణమి ఒక్కరోజు ఇలా చేసినా చాలు !

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి హరిహరులకు అత్యంత ప్రీతికరమైన రోజు. అన్ని మాసాల్లోకెల్లా ఈ కార్తీక మాసానికి విశిష్టత ఉందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయాలి. వీలవకపోతే.. గంగాజలం కలిపిన నీటితో ఇంట్లోనే స్నానం చేయవచ్చు. లక్ష్మీ దేవి, శ్రీమహావిష్ణువు, శివుడి ముందు నెయ్యితో దీపం వెలిగించి, పండ్లు, పువ్వులు, నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వండి. అవకాశం ఉంటే.. ఉపవాసం పాటిస్తే మంచిది. రాత్రి చంద్రోదయం తర్వాత పచ్చి పాలను నీటిలో కలిపి చంద్రుడికి సమర్పించాలి. విష్ణువును పూజించిన తర్వాత చలిమిడి, వడపప్పు సహా పంచామృతాన్ని ప్రసాదంగా సమర్పించి ఉపవాసం విరమించాలి.

పురాణాల ప్రకారం, విష్ణువు ఈ మాసంలో మత్స్యావతారం దాల్చారు. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం, దానం చేయడం వల్ల ఈ మాసమంతా పూజించినంత ఫలితం లభిస్తుందని విశ్వాసం. సిక్కు మతం ప్రకారం, కార్తీక పూర్ణిమను గురునానక్ జయంతిగా కూడా జరుపుకుంటారు. నెలరోజులూ పూజలు చేస్తే వచ్చే ఫలితం ఒక ఎత్తు..  పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు అని పండితులు చెబుతున్నారు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు ఈరోజు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.

కార్తీకపౌర్ణమి రోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాల్లో భక్తులు దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయల మీద, బియ్యం పిండితో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ, పూలతో అలంకరించుకొని వెలిగించాలి. 

శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్త్తెన ప్రదేశాల్లో భరిణలతో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో విడిచి పెడతారు. ఇలా చేయడం వల్ల.. పుణ్యం దక్కుతుందని, అష్టశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది.