- ఉత్తర్వులు జారీచేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మరో 824 సర్కారు విద్యాసంస్థల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ జారీ చేశారు. 495 కేజీబీవీలు, 194 మోడల్ స్కూళ్లు, 35 సొసైటీ గురుకులాలతో పాటు వంద పీఎం శ్రీ స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. కో ఎడ్యుకేషన్ స్కూళ్లలో 16 మంది బాయ్స్, 16 మంది గర్ల్స్ తో, కేజీబీవీల్లో 32 మందితో స్కౌట్ టీమ్ ఏర్పాటు చేయనున్నారు.
విద్యార్థుల్లో సమగ్ర వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్టు విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, వేగంగా మారుతున్న ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన లైఫ్‌స్కిల్స్, క్రమశిక్షణ, నాయకత్వం, టీమ్ వర్క్ తదితర వాటిలో మెలుకువల కోసం ఇది ఉపయోగపడుతుందని వెల్లడించారు. స్కౌట్స్ టీమ్ కోసం ప్రతి వారం ఒక పీరియెడ్ ఉంటుందని, అదనంగా డ్రిల్స్, శిబిరాలు, సేవా కార్యక్రమాల కోసం శనివారం కేటాయించాల్సి ఉంటుంది.
