ప్రస్తుత సమాజంలో సురక్షితమైన ప్రయాణం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ముఖ్యంగా ప్రైవేట్, ప్రభుత్వ రవాణావ్యవస్థలలో ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం తక్షణావసరం. ఈ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రవాణా భద్రతపై తక్షణ దృష్టి సారించి కీలకమైన మార్పులను తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి, రవాణా శాఖ మంత్రివర్యులకు, ప్రభుత్వానికి కొన్ని ప్రధాన సూచనలు, విజ్ఞప్తులు ఉన్నాయి.
అధునాతన పర్యవేక్షణ, సాంకేతికత వినియోగం
ప్రమాదాల నివారణలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. వోల్వో వంటి అధునాతన బస్సులతో సహా అన్నిరకాల బస్సులలో డ్రైవింగ్‌ను పర్యవేక్షించే 'కెమెరా' వ్యవస్థను తప్పనిసరి చేయాలి. ఈ వ్యవస్థ ద్వారా డ్రైవర్ ప్రవర్తన, వేగం, ప్రయాణ వివరాలను నిరంతరం ట్రాక్ చేయవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక కేంద్రీకృత డేటాబేస్లో భద్రపరచాలి. ఈ డేటా ప్రమాదాల విచారణకు, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఉపకరిస్తుంది.
ప్రయాణికులకు సమగ్ర భద్రతా సమాచారం
ప్రతి ప్రయాణం ప్రారంభించేముందు ప్రయాణికులకు భద్రతాచర్యలపై పూర్తి అవగాహన కల్పించాలి. టికెట్ జారీ చేసే సమయంలోనే వారికి ఒక చిన్నపాటి భద్రతా సమాచారపత్రాన్ని అందించాలి. ఈ పత్రంలో, బస్సు లోపల స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసిన బోర్డులపై ఈ కింది వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, వాటిని ఉపయోగించే విధానం, అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయనేది వివరంగా తెలియజేయాలి. ఆపద సమయంలో ఉపయోగించాల్సిన అలారం సిస్టం గురించి వివరాలు తెలపాలి.
యాక్సిడెంట్ జోన్ల గుర్తింపు,బోర్డుల ఏర్పాటు రోడ్డు రవాణా సంస్థ, ప్రభుత్వం సంయుక్తంగా రాష్ట్రంలో తరచుగా ప్రమాదాలు జరిగే "యాక్సిడెంట్ జోన్లను" గుర్తించాలి. ఆ ప్రాంతాలలో డ్రైవర్లను, ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ, సరియైన జాగ్రత్తలకు సంబంధించిన హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
వోల్వో బస్సు డ్రైవర్ల శిక్షణ, పర్యవేక్షణ
వోల్వో వంటి అధునాతన బస్సులను నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా పూర్తిస్థాయిలో ప్రత్యేక శిక్షణ పొంది ఉండాలి. వారి శిక్షణ, అనుభవం, ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ఒక కేంద్రీకృత డేటాబేస్లో నిల్వ చేయాలి. సమయాన్ని బట్టి ఈ డ్రైవర్ల నైపుణ్యాన్ని, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలి.
ప్రయాణికుల ఫిర్యాదులు, సూచనలకు ప్రాధాన్యత
ప్రయాణికుల ఫిర్యాదులు, సూచనల కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో అనుసంధానించిన ఒక వ్యవస్థను రూపొందించాలి. దానిని ప్రభుత్వం రవాణాశాఖతో కలిపి అమలుచేయాలి. దీనిద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు ప్రయాణికుల కంప్లైంట్‌లను సులభంగా తెలుసుకొని పరిష్కరించవచ్చు. అలాగే నియమాలు పాటించని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలపై తగినచర్యలు కూడా సత్వరం తీసుకోవాలి.
ప్రతి ఒక్కరి సురక్షిత ప్రయాణం అనేది కేవలం ఒక సౌకర్యం కాదు, అది ఒక మానవహక్కుగా పరిగణించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలకమైన సూచనలను పరిశీలించి వాటి అమలుకు చర్యలు తీసుకుంటే ప్రయాణికుల భద్రత మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.
బస్సులలో సహాయక బృందాల ఏర్పాటు, శిక్షణ
విమానాలలో ఉండే ఎయిర్ హోస్టెస్ తరహాలో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే అన్ని బస్సులలో 'బస్సు సహాయక బృందాన్ని' ఏర్పాటు చేయాలి. ఈ బృందానికి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించడం, భద్రతా చర్యలను వివరించడం, ప్రథమ చికిత్స అందించడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వం తక్షణం అమలు చేయాల్సిన అనివార్య అంశాలలో ఇది మరింత ప్రధానమైనది.
యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, చట్టపరమైన రక్షణ
ప్రభుత్వ లేదా ప్రైవేట్ బస్సులలో ప్రయాణించే ప్రతి పౌరుడికి టికెట్ ధరలోనే కలిపి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావాలి. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు తక్షణ ఆర్థికభద్రత, వైద్యసహాయం అందించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాక, రోడ్డు ప్రమాదాలను సాధారణ ఘటనలుగా కాకుండా యాక్సిడెంట్ అఫెన్స్‌గా గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయాలి. దీనిద్వారా ప్రమాదాలకు కారణమైనవారిపై కఠినచర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
ప్రైవేట్ బస్సుల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ
ముఖ్య నగరాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రద్దీని, నియంత్రణను పర్యవేక్షించడానికి ప్రత్యేక బస్‌స్టాండ్‌లు ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ బస్సుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడానికి ఒక ప్రత్యేక పర్యవేక్షణా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
తాళ్లపల్లి సురేందర్ గౌడ్
