పులుల లెక్కింపు కోసం వాలంటీర్లకు ఆహ్వానం

పులుల లెక్కింపు కోసం వాలంటీర్లకు ఆహ్వానం
  • 22 వరకు దరఖాస్తుల స్వీకరణ.. జనవరి 17 నుంచి సర్వే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని అడవుల్లో ఉన్న పులులను, ఇతర వన్యప్రాణలను లెక్కించేందుకు వాలంటీర్లను ఆహ్వానిస్తున్నట్లు వన్యప్రాణుల సంరక్షణ అధికారి ఈలు సింగ్ మేరు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఈ నెల 3 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. 22వ తేదీతో గడువు ముగియనుందన్నారు. అఖిల భారత పులుల లెక్కింపు (ఏఐటీఈ) 2026లో భాగంగా ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని..పౌరులు, విద్యార్థులు, వన్యప్రాణి అభిమానులు వాలంటీర్లుగా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి సర్వేగా రికార్డు సృష్టించనుందన్నారు. 2022 లెక్కల ప్రకారం.. దేశంలో పులుల సంఖ్య 3,967గా ఉంది. 

ఈ సారి రాష్ట్రంలోని సుమారు 26,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో సర్వే నిర్వహించనున్నారు. జనవరి 17వ తేదీన పులుల గణన ప్రారంభం కానుండగా.. 23 వరకు కొనసాగనున్నది. ఈ మెగా సర్వేలో వాలంటీర్లదే కీలకపాత్ర అని ఈలు సింగ్ మేరు తెలిపారు. ఫారెస్ట్ ఆఫీసర్లతో కలిసి పులుల ఉనికిని గుర్తించాల్సి ఉంటుందన్నారు. ఏడు రోజుల పాటు అడవుల్లో ‘ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఎంపికైన వాలంటీర్లకు స్పెషల్​ ట్రైనింగ్​ఇస్తామన్నారు. 18 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు, రోజుకు 10 నుంచి 15 కిలోమీటర్లు నడిచే ఫిట్​నెస్ అర్హతలని..రిమోట్ ఫారెస్ట్ క్యాంపుల్లో 

7 రోజులు ఉండటానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇది పూర్తిగా ప్రో-బోనో (సేవా) కార్యక్రమమని, ఎలాంటి జీతభత్యాలు ఇవ్వరని వెల్లడించారు.  వసతి, ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ మాత్రమే అటవీశాఖ చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ లింక్: https://tinyurl.com/aite2026tg అని.. సందేహాలుంటే టోల్ ఫ్రీ: 18004255364 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.