- ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ, సంజయ్‌కు నోటీసులు
- అనర్హత పిటిషన్లు వేసిన ఎమ్మెల్యేలను విచారించనున్న స్పీకర్
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండో విడత విచారణ ఈ నెల 6 నుంచి రెండ్రోజుల పాటు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కొనసాగించనున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికపూడి గాంధీ, డాక్టర్ సంజయ్‌ని విచారణకు హాజరుకావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించింది.
ఈ నలుగురిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానందను కూడా ఈ విచారణకు హాజరుకావాలని స్పీకర్ ఆఫీసు కోరింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఈ విచారణ కొనసాగించనున్న స్పీకర్.. మళ్లీ ఈ నెల 12, 13 తేదీల్లో వీరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.
ఇప్పటికే మొదటి విడతలో ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిని స్పీకర్ విచారించారు. రెండో విడతలో మరో నలుగురు ఎమ్మెల్యేలను విచారించనున్నారు. మరోవైపు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి.. స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వకపోవడంతో వారి విచారణ పెండింగ్‌లో ఉంది.
