
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ కేంద్రంగా సిమ్ బాక్స్‌లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ ఎ.భాస్కర్ బుధవారం వెల్లడించారు. జన్నారంలోని వొడాఫోన్ టవర్ పరిధిలో కొంతకాలంగా అనుమానాస్పద సిమ్‌కార్డులను ఉపయోగిస్తున్నారన్న సమాచారం అందడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, టెలికం డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు బుధవారం తనిఖీలు చేపట్టారు. కిష్టాపూర్‌లోని ఓ ఇంట్లో సిమ్ బాక్స్‌లు ఏర్పాటు చేసి వేర్వేరు ఐఎంఈఐ నంబర్లు, పలు రకాల లింక్‌లు తయారు చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
ఈ కేసులో ఏపీలోని మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన యాండ్రపు కామేశ్ (24), జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన బావు బాపయ్య (43), బావు మధుకర్(32), మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్‌కు చెందిన గొట్ల రాజేశ్(40)ను అరెస్ట్ చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి నుంచి 262 సిమ్ కార్డులు, డీలింక్ 8 పోర్ట్‌లు, మూడు మొబైల్స్, రెండు యూఎస్‌బీ కేబుల్స్, ఐదు సిమ్ ప్యానెల్స్, ఒక ల్యాప్‌టాప్, ఒక మోడెమ్, ఒక ఎయిర్ ఫైబర్ బాక్స్, పలు కేబుల్స్ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు.
కాంబోడియా నుంచి ప్లాన్
ఈ సైబర్ నేరాల అసలు సూత్రధారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన పాలవలసల సాయికృష్ణ అలియాస్జాక్గా పోలీసులు గుర్తించారు. లక్ష్మీపూర్‌కు చెందిన బావు బాపయ్య ఉపాధి కోసం కాంబోడియావెళ్లడానికి 2023లో వీసా కోసం ఛండీగఢ్ వెళ్లగా.. అక్కడ జాక్ పరిచయం అయ్యాడు. 2024 జూలైలో కాంబోడియా వెళ్లిన బాపయ్య అక్కడ ఓ రెస్టారెంట్‌లో పనిచేశాడు. అదే ఏడాది డిసెంబర్‌లో జాక్ సైతం కాంబోడియా వెళ్లి బాపయ్యను కలిశాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాపయ్య ఇండియాకు తిరిగి రాగా.. జాక్ అతడికి ఫోన్ చేసి తన ప్లాన్ గురించి వివరించాడు.
అతడి సూచన మేరకు బాపయ్య కిష్టాపూర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకోగా.. సైబర్ నేరాలకు సంబంధించిన పరికరాలను జాక్ పంపించాడు. తర్వాత బాపయ్య తన తమ్ముడు మధుకర్, బావ రాజేశ్‌తో కలిసి సైబర్ నేరాలు మొదలుపెట్టాడు. అలాగై ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు నష్టపోయిన యాండ్రపు కామేశ్‌ను జాక్ టెలిగ్రామ్ ద్వారా పరిచయం చేసుకొని అతడిని సైతం సైబర్ క్రైమ్‌లోకి దించాడు. సైబర్ నేరాల ముఠాను పట్టుకున్న పోలీసులను డీసీపీ అభినందించారు.