
ఆసిఫాబాద్, వెలుగు : పాము కాటుతో బాలుడు చనిపోయిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. రెబ్బెన మండలం గొల్లగూడకు చెందిన మొగిలి చిన్నన్నకు ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు శ్యామ్(4) మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. శ్యామ్ లేచి ఏడ్వడంతో తల్లిదండ్రులు ఏమైందని అడగగా చెవి నొప్పి వస్తుందని చెప్పాడు.
చిన్నన్న సోదరుడు శ్రీశైలం వచ్చి శ్యామ్ చెవి వద్ద పాము కాట్లు గుర్తించాడు. వెంటనే బైక్ పై రెబ్బెన పీహెచ్ సీకి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేశారు. అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా.. అందుబాటులో లేకపోవడంతో బైక్ పైనే వెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే బాలుడు చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. రెబ్బెన పీహెచ్ సీ సిబ్బంది వెంటనే స్పందించి ట్రీట్ మెంట్ చేసి ఉంటే తమ కొడుకు బతికేవాడని తల్లిదండ్రులు విలపిస్తూ చెప్పారు.
గద్వాల జిల్లాలో స్టూడెంట్ ను కాటేసిన పాము
అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగోట్లలోని కేజీబీవీ విద్యార్థిని పాము కాటుకు గురైంది. మేన్నిపాడు గ్రామానికి చెందిన దాక్షాయిని కేజీబీవీ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతుం ది. బుధవారం స్కూల్ ఆవరణలో పాముకాటు వేయగా తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చెప్పింది. కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించిన అనంతరం కూతురిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. ఘటనపై స్కూల్ ఎస్ఓ కు ఫోన్ చేయగా స్పందించలేదు.