
- మూడునాలుగు ఫ్యామిలీల చుట్టే అధికారం
- విదేశాల్లో పాలకుల పిల్లల జల్సాలు..కటిక దారిద్ర్యంలో స్థానికులు
- భారీగా పెరిగిన నిరుద్యోగం
- సోషల్ మీడియాపై బ్యాన్‌తో దెబ్బతిన్న టూరిజం
- రాజకీయ అస్థిరత.. 17 ఏండ్లలో 13 సార్లు మారిన ప్రభుత్వాలు
నేపాల్‌లో ఏమైంది?! 24 గంటల్లోనే ప్రభుత్వం కుప్పకూలడానికి కారణం ఏమిటి? దశాబ్దాలుగా ఎన్నో సమస్యలతో లోలోపల రగిలిపోతున్న ప్రజల ఆగ్రహం.. సోషల్ మీడియాపై బ్యాన్‌తో ఒక్కసారిగా బద్ధలైంది. జెట్ స్పీడ్‌తో ‘జెన్ జెడ్’ తరం దూసుకొచ్చింది. మూడు నాలుగు కుటుంబాల చుట్టే పవర్ గేమ్ చక్కర్లు కొడ్తుండటం, స్థానికులు కటిక దారిద్ర్యంలో మగ్గుతుంటే.. లీడర్ల పిల్లలు విదేశాల్లో తైతక్కలాడటం, నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగం.. అంతకంతకూ రెట్టింపవుతున్న నాయకుల అవినీతి దందాలు.. ఇలా ఎన్నో అంశాలపై యువతరం మర్లవడింది. ఆ దాటికి పాలకులు రాజీనామాలు చేసి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సి వచ్చింది. వెలుగు, సెంట్రల్ డెస్క్
ఖాట్మాండు:
నేపాల్... పేరు వింటేనే గుర్తుకొచ్చేవి.. చల్లటి మంచు కొండలు.. అందమైన టూరిజం స్పాట్లు. అలాంటి నేపాల్.. ఇప్పుడు తగలబడిపోయింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే అక్కడి ప్రభుత్వం కుప్పకూలింది. రాజకీయ నేతల అవినీతి, వారి పిల్లల విలాసవంతమైన జీవితాలు, వృద్ధ నాయకత్వం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా 20 నుంచి 25 ఏండ్లలోపు ఉన్న లక్షలాది మంది యువకులు రోడ్లపైకొచ్చి నిరసన తెలిపారు.
స్కూల్ యూనిఫాంలు, కాలేజీ డ్రెస్సుల్లోనే ఆందోళనకు దిగారు. నేతల అసమర్థ పాలనపై రగిలిపోయారు. 26 సోషల్ మీడియా యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన.. యువతను మరింత ఆగ్రహానికి గురి చేసింది. అవినీతికి వ్యతిరేకంగా ‘హామీ నేపాల్’ అనే ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో ‘జెన్ జెడ్’ యూత్ చేపట్టిన శాంతియుత నిరసన, చివరికి లూటీ.. భౌతిక దాడులు.. హింసాత్మకంగా మారింది. ప్రధాని నివాసం.. పార్లమెంట్ భవనం.. కోర్టులు.. ప్రభుత్వ ఆఫీసులు.. కేంద్ర మంత్రుల బంగ్లాలు.. మాజీ ప్రధానుల క్వార్టర్లు.. ఇలా ఏ గవర్నమెంట్ దఫ్తర్ కనిపిస్తే దానికి యువకులు నిప్పు పెట్టేశారు.
హోటళ్లు.. షాపింగ్ మాల్స్ ను లూటీ చేశారు. చివరికి ప్రధానమంత్రి కేపీ.ఓలి తన పదవికి రాజీనామా చేసినా హింస మాత్రం ఆగలేదు. ప్రజా ధనాన్ని దోచుకుంటూ.. విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న రాజకీయ నేతలపై దాడులు చేశారు. చివరికి ఆర్మీ రంగంలోకి దిగి పరిస్థితిని కొంత వరకు చక్కబెట్టే ప్రయత్నం చేసింది.
వృద్ధ నాయకత్వంపై వ్యతిరేకత
వృద్ధ నాయకత్వంతోనూ నేపాల్ యువకులు విరక్తి చెం దారు. 70 ఏండ్ల పైబడినవాళ్లు కొన్ని దశాబ్దాల పాటు పాలించడాన్ని వ్యతిరేకించారు. 2008 కంటే ముందు నేపాల్‌ను రాజులు పాలించేవాళ్లు. ఈ తర్వాత ప్రజాస్వామ్య పాలన మొదలైంది. పాలించేవాళ్ల వయస్సు 70 ఏండ్లపైనే ఉండేది. కేపీ.ఓలీ, పుష్పకమల్ దహల్, షేర్ బహదుర్ దేవుబా విడతల వారీగా నేపాల్‌ను పాలిస్తూ వచ్చారు. వీళ్లంతా తమ పదవీ కాలంలో అవినీతికి పాల్పడినవాళ్లే. అంతేకాకుండా ఎలాంటి అవినీతికి పాల్పడినా.. ఏ ప్రధానిని కూడా విచారించకుండా 2006లో చట్టం తీసుకొచ్చారు. ఇది నేపాల్ యువతకు నచ్చలేదు.
ఫ్రీడం ఆఫ్ స్పీచ్ దెబ్బతీసేలా..
ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అక్కడి యువకులు సోషల్ మీడియా వేదికగా తెలియజేసేవాళ్లు. ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనే నిషేధం విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. నేపాల్‌ను తగులబెట్టే దాకా తీసుకెళ్లింది. ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించేందుకు ఎలాంటి వేదిక యువత వద్ద లేకుండా పోయింది.
దీంతో ప్రభుత్వ నిర్ణయంపై రగిలిపోయిన యువత.. రోడ్లపైకొచ్చి నిరసన తెలియజేసింది. 12 ఏండ్ల బాలుడు పోలీసుల ఫైరింగ్‌లో చనిపోవడం యువకులను మరింత ఆగ్రహానికి గురి చేసింది. నేపాల్‌కు ప్రధానులుగా పని చేసిన వేర్వేరుగా పార్టీలకు చెందిన కేపీ.ఓలీ, ప్రచండ, మాధవ్ కుమార్ నేపాల్, ఝాలా నాథ్ఖనల్, షేర్ బహుదూర్ దేవ్బా.. ఇండ్లను తగులబెట్టేశారు. నఖు సెంట్రల్ జైలుపై దాడి చేసి నిప్పు పెట్టారు. కేపీ.ఓలీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి.. జైల్లో ఉన్న ప్రతిపక్ష నేత, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చీఫ్ రవి లాబిఛానేను నిరసనకారులు విడిపించుకుని తీసుకెళ్లిపోయారు.
సోషల్ మీడియా బ్యాన్ వెనుక ప్లాన్
తమ అవినీతి, నిరుద్యోగం, పిల్లల విలాసవంతమైన జీవితాలను నేపాలీ యువకులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండటం నేతలకు నచ్చలేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేశారు. సోషల్ మీడియా సంస్థలకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉండాలని 2023, నవంబర్‌లో రూల్ తీసుకొచ్చారు. లోకల్‌గా ఆఫీస్ సెటప్‌కు ఆదేశించారు. హేట్ స్పీచ్, ఫేక్ న్యూస్, ఫ్రాడ్స్‌ను అడ్డుకునేందుకే రిజిస్ట్రేషన్ నిబంధన తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
కొన్ని సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఒక టిక్‌టాక్ మాత్రమే రిజిస్టర్ చేసుకున్నది. సుప్రీం కోర్టు కూడా సోషల్ మీడియా బ్యాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2025, ఆగస్టు 28న 10 రోజుల టైమ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలని ఆదేశించింది. చాలా తక్కువ టైమ్ ఇవ్వడంతో ఎవరూ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. దీంతో మొత్తం 23 యాప్‌లపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది.
టూరిజంపై దెబ్బ
నేపాల్ అనేది టూరిస్ట్ స్పాట్. ఆ దేశ ఆర్థికాభివృద్ధిలో టూరిజం సెక్టార్ కీలక పాత్ర పోషిస్తుంది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇక్కడి యువత సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతుంటుంది. రూమ్స్ బుకింగ్స్, పారా గ్లైడ్స్, ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్ల స్లాట్లు బుక్ చేసుకునేందుకు టూరిస్టులు ఎఈ క్కువగా సోషల్ మీడియా ద్వారానే కాంటాక్ట్ అవుతుంటారు. సోషల్ మీడియా బ్యాన్.. టూరిజం సెక్టార్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో నేపాలీ ఫ్యామిలీలు ఉపాధిని కోల్పోయాయి. విదేశాల్లో ఉన్న తమ పిల్లలతో మాట్లాడుకునేందుకు ఉపయోగించే యాప్స్‌ను బ్యాన్ చేయడంతో లక్షలాది మంది తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాబ్స్, స్టడీ కోసం 70 లక్షలకు పైగా నేపాలీలు విదేశాల్లో ఉన్నారు.
షేర్ బహుదుర్ దేవుబా
విమానాల కొనుగోళ్లలో మాజీ ప్రధాని అయిన షేర్ బహుదుర్ దేవుబా.. భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేపాల్ పౌరులను ఫేక్ డాక్యుమెంట్లతో భూటాన్ సిటిజన్స్‌గా మార్చి వలసదారుల పేరుతో అమెరికా పంపేదంటూ ఆయన భార్య అర్జు రాణా దేవుబా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
పుష్ప కమల్ దహల్
సీపీఎన్ - ఎంసీ పార్టీ చీఫ్, 3 సార్లు ప్రధానిగా పని చేసిన పుష్ప కమల్ దహల్పై అవినీతి ఆరోపణలున్నాయి. మావోయిస్టు గెరిల్లా ఫైటర్స్ పేరుతో వచ్చిన నిధులను డైవర్ట్ చేస్తూ.. కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కేపీ.ఓలీ
మాజీ ప్రధాని కేపీ.ఓలీపై కూడా అవినీతి కేసు నడుస్తున్నది. సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. గరిబుల్లా అనే టీ ఎస్టేట్‌ను కమర్షియల్ ప్లాట్లుగా మార్చి డబ్బులు దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాగే, మరో ముగ్గురు ప్రధానులు మాధవ్ కుమార్ నేపాల్, బాబురాం భట్టారాయ్, ఖిల్ రాజ్ రెజ్మీ పై కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.